
సాక్షి, సిటీబ్యూరో : ప్రముఖ ఫోన్ల విక్రయ సంస్థ ఎంఐ పేరుతో నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటైంది. ఇది అసలుదే అని నమ్మిన బాధితుడు ఓ ఫోన్ ఖరీదు చేయడానికి రూ.18 వేలు బదిలీ చేసి మోసపోయాడు. చివరకు విషయం తెలుసుకున్న అతడు శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని పశ్చిమ మండలంలో ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆన్‌లైన్‌లో ఎంఐ ఫోన్ ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసిన ఆయనకు ఎంఐ సంస్థ పేరిట ఓ వెబ్‌సైట్ కనిపించింది. (www.mi-home.in) చిరునామాతో, అసలు వెబ్‌సైట్‌ను పోలినట్లే ఇది ఉంది.
దీంతో దాని ద్వారా రెడ్‌మీ నోట్–9 ఫోన్ ఖరీదు చేసిన ఆయన ఆ సైట్ ద్వారానే రూ.18 వేలు చెల్లించారు. ఎప్పటికీ ఫోన్ డెలివరీ కాకపోవడంతో అనుమానం వచ్చి ఎంఐ సంస్థను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆ సైట్ నకిలీదని తెలిసింది. దీంతో బాధితుడు శనివారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ తరహాకు చెందిన నకిలీ వెబ్‌సైట్స్ మరికొన్ని ఉండవచ్చని, చెల్లింపులు చేసే ముందు ప్రతి ఒక్కరూ సరి చూసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.