రమేశ్‌కు దేహశుద్ధి చేస్తున్న మమత కుటుంబ సభ్యులు
చేర్యాల(సిద్దిపేట) : భార్య ఉండగా.. మరో వివాహితతో సహజీవనం చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌కు దేహశుద్ధి జరిగిన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాలలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గూడెల్లి రమేశ్(పీసీ 3903) 2006లో మహబూబాబాద్ జిల్లా మరిపెడబంగ్లా మండలంలోని బావుజీగూడెంకు చెందిన మమతను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఉద్యోగ రీత్యా మద్దూరులో పనిచేస్తున్న రమేశ్‌కు ఇదే మండలానికి చెందిన గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన మరో వివాహితతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈక్రమంలో ఇద్దరు కలిసి చేర్యాలలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. రమేశ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య.. భర్తను పలుమార్లు మందలించినప్పటికీ అతనిలో మార్పు రాలేదు.
ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మమత తన తల్లితండ్రులతో కలిసి రమేశ్ అద్దెకుంటున్న ఇంటికి వచ్చింది. రమేశ్, అతనితో ఉంటున్న మహిళను పట్టుకున్న మమత తరపు బంధువులు వారిని చితకబాదారు. విషయం తెలుసుకున్న చేర్యాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసి నివేదికను సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్‌కు అందజేశారు. దీంతో రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment