హంతకులను పట్టించిన మేక  | Police Officers Solved Murder Case In Kurnool | Sakshi
Sakshi News home page

మేకల కాపరి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

Published Tue, Jul 9 2019 8:32 AM | Last Updated on Tue, Jul 9 2019 12:14 PM

Police Officers Solved Murder Case In Kurnool  - Sakshi

సాక్షి, కర్నూలు : తుగ్గలి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన మేకల కాపరి రాము నాయక్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ నెల 4న రామునాయక్‌ దారుణ హత్యకు గురైయ్యాడు. భార్య దేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జొన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అందరిని ఆశ్చర్యపరిచే అంశం వెలుగు చూసింది. తనకున్న అప్పు తీర్చడం కోసం ప్యాపిలి గ్రామానికి చెందిన కొండపాటి గోవిందు కుమారుడు కృష్ణాకాంత్, అదే గ్రామానికి చెందిన పోదొడ్డి పుల్లన్న కొడుకు పోదొడ్డి చెన్నుతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.

ఘటన జరిగిన 48 గంటల్లోపే కేసు మిస్టరీని ఛేదించి డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రశంసలను పోలీసు అధికారులు అందుకున్నారు. రామునాయక్‌ను హత్య చేసిన ముద్దాయిలను అరెస్ట్‌ చేసి జిల్లా కేంద్రానికి తీసుకు వచ్చి ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట హాజరు పరిచారు. వారి వద్ద నుంచి రూ.55 వేల నగదు, నేరానికి ఉపయోగించిన టాటా ఏసీ వాహనం స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో అడిషనల్‌ ఎస్పీ ఆంజనేయులుతో కలిసి ఎస్పీ ఫక్కీరప్ప నిందితుల వివరాలను విలేకరులకు వెల్లడించారు. 

ఐదు బృందాలతో కేసు దర్యాప్తు.. 
సంఘటన జరిగిన కొండగట్టు ప్రాంతాన్ని ఎస్పీ ఫక్కీరప్ప స్వయంగా పరిశీలించి డోన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు స్పెషల్‌ పార్టీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసు గుట్టును రట్టు చేశారు. నేరం జరిగిన తీరు పరిశీలించిన పోలీసులు గ్రామానికి దూరంగా ఖాళీ ప్రదేశంలో ఒంటరిగా ఉన్న మేకల కాపరి రామునాయక్‌ను కిరాతకంగా చంపి, 25 గొర్రెలను ఎలాంటి అనుమానం రాకుండా తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి 100 కిలోమీటర్ల వరకు టోల్‌గేట్ల సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి మిస్టరీని ఛేదించారు.  

హంతకులను పట్టించిన మేక 
కృష్ణగిరి మండలం అమకతాడు టోల్‌గేట్‌ సీసీ ఫుటేజీని పరిశీలిస్తుండగా జూలై 4న రాత్రి 9.15 గంటలకు టాటా ఏస్‌ వాహనంలో కర్నూలు వైపు మేకలు తరలిస్తున్నట్లు ఓ మేక తల బయటకు కనిపించడం బట్టి నిర్ధారించుకున్నారు. ఆ వాహనం నంబర్‌ సీసీ ఫుటేజ్‌లో నమోదు కావడంతో దర్యాప్తు బృందం ఆదోని మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించి ఆరా తీయగా ప్యాపిలికి చెందిన శివసాయిది గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది.

బసినేపల్లి గ్రామంలోని అత్తమామల మేకలను హైదరాబాద్‌లో అమ్ముకొని రావాలని కృష్ణకాంత్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి తన వాహనాన్ని కిరాయికి తీసుకెళ్లాడని శివసాయి పోలీసులకు తెలిపాడు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మేకలను ఐదు కిలోమీటర్ల మేర నడిపించుకొని ప్యాపిలి–జొన్నగిరి రోడ్డు వద్ద కలసట్ల గ్రామ శివారులో వాహనంలో ఎక్కించుకొని డోన్‌ మార్గం గుండా టోల్‌ ప్లాజా దాటి హైదరాబాద్‌కు వెళ్లి జియాగూడా మార్కెట్‌లో రూ.70వేలకు విక్రయించి సొమ్ముచేసున్నట్లు అంగీకరించారు. కేసును త్వరగా ఛేదించిన డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐలు సోమశేఖరరెడ్డి, రామలింగయ్య, సురేష్‌బాబు, విక్రమసింహ, చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐలు సతీష్‌కుమార్, రమేష్‌బాబు, చంద్రశేఖరరెడ్డి, మారుతీశంకర్, వేణుగోపాల్‌ తదితరులను ఎస్పీ ఫక్కీరప్ప అభినందించి, నగదు రివార్డులను అందజేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement