మార్చురీ ఎదుట మృతదేహంతో ఆందోళన
ఖమ్మంవైద్యవిభాగం : ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రధానాసుపత్రిలో ఆదివారం గర్భిణి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఖమ్మం నగర శివారులోని కైకొండాయిగూడేనికి చెందిన నకిరికంటి కీర్తి(23), నిండు గర్భిణి. ఆమె భర్త సురేష్, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.
కీర్తి గర్భవతయినప్పటి నుంచి జిల్లా కేంద్ర ప్రధానాసుపత్రిలోనే చూపించుకుంటోంది. డాక్టర్లు ఆమెకు జూన్ 12న డెలివరీ డేట్ ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో ఆమె ఆకస్మకంగా అస్వస్థురాలైంది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండడం, దగ్గు, కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబీకులు, బంధువులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆమెకు డ్యూటీ డాక్టర్ అత్యవసర చికిత్స అందించారు. ఈసీజీ చేయటంతోపాటు ఇంజక్షన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కీర్తి నోట్లో నుంచి నురగ వచ్చింది. కొద్దిసేపటిలోనే (5.25 గంటల సమయంలో) మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యపు వైద్యం కారణంగానే కీర్తి మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రి క్యాజువాల్టీలో ఆందోళనకు దిగారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టూటౌన్ పోలీసులు వచ్చారు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఆ తరువాత, మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా అక్కడ (మార్చురీ ఎదుట) ఆమె ఆందోళనకారులు అడ్డగించారు. అక్కడి నుంచి మృతదేహంతో కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. వారికి పోలీసులు నచ్చచెప్పి శాంతింపచేశారు.
వైద్యుల తప్పు లేదు
దీనిపై ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ టి.మదన్‌సింగ్‌ను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘ఆ గర్భిణి మృతి విషయంలో మా తప్పు ఎంతమాత్రం లేదు. బీపీ ఎక్కువై, గుండెపోటు రావటంతో మృతి చెందింది. ప్రతి నెల ఆమెను మా డాక్టర్లు పరీక్షిస్తున్నారు. ఆమెకు బ్లడ్ కూడా తక్కువగా ఉంది. దీనిని ఆమె భర్తకు కూడా చెప్పాం.
వారు ఆమెను ఇక్కడకు తీసుకొచ్చిన గంటలోనే పరిస్థితి విషమించి మృతిచెందింది. పేషంట్‌ను రక్షించేందుకు డ్యూటీ డాక్టర్ ఇంజక్షన్ ఇస్తే... దాని కారణంగానే మృతిచెందిందని అనడం సమంజసం కాదు. సీరియస్ కండీషన్‌తో వచ్చే పేషంట్లను బతికించేందుకే ప్రయత్నిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment