తొందరపడ్డావు తల్లీ..! | Pregnent Woman Suicide In Chittoor | Sakshi
Sakshi News home page

తొందరపడ్డావు తల్లీ..!

Published Fri, Jun 15 2018 9:38 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Pregnent Woman Suicide In Chittoor - Sakshi

నిందుతులను అరెస్టు చూపుతున్న పోలీసులు

ఇద్దరు ఆడబిడ్డలు పుట్టగా.. మగబిడ్డకోసం భర్త, అత్తమామలు వేధించారు.. మళ్లీ ఆడబిడ్డ పుడితే.. అన్న ఆలోచనతో ఆడబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్టులో ఆమె కడుపులో ఉన్నది మగశిశువని తేలింది. తొందరపడ్డావేమో తల్లీ అంటూ బంధువులు దుఃఖిస్తున్నారు.

చిత్తూరు రూరల్‌: చిత్తూరు రూరల్‌ మండలం పేయనకండ్రిగకు చెందిన గర్భిణి సరళ (25) తన ఇద్దరు కుమార్తెలు జా హ్నవి (5), దేవిశ్రీ (2)లతో సహా బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. మగబిడ్డ లేద న్న కారణంతో భర్త, అత్త, మామ ఆమె ను కొంతకాలంగా వేధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం వారు ఆమెను కొట్టడం, దుర్భాషలాడడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇరుగుపొరుగుతోనూ తన బాధను చెప్పుకోలేక జీవితం పై విరక్తి చెంది గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తాను లేకపోతే తన ఇద్దరు కుమార్తెలు ఏమైపోతారో.. వాళ్ల ఆలనాపాలన ఎవ రు చూసుకుంటారో.. తనకు పట్టిన గతి వాళ్లకూ పడుతుందేమోనని వ్యథచెంది తనతో పాటు వారినీ మృత్యు ఒడిలోకి చేర్చింది.

కడుపులో మగబిడ్డే..
బుధవారం ఇద్దరు బిడ్డలతో సహా గర్భిణి సరళ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం సరళ మృతదేహాన్ని పోలీసులు, వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టంలో సరళ కడుపులో ఉన్నది మగబిడ్డ అని తేలింది. సాయంత్రం డీఎస్పీ సుబ్బారావు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.  విషయం తెలు సుకున్న తండ్రి, బంధువులు ‘తొందర పడ్డావు తల్లీ’ అంటూ రోదిస్తున్నారు.

ఆత్మహత్య కారణమైన కుటుంబీకుల అరెస్ట్‌
ఇద్దరు ఆడబిడ్డలతో సహా గర్భిణి సరళ ఆత్మహత్యకు కారణమైన కుటుంబీల ను గురువారం తాలూకా పోలీసులు అరెస్టు చేశారు.  భర్త గురునాథం (35), అత్త చిన్నమ్మ (45), మామ రాజేంద్ర (55)లను పోలీసులు డీఎస్పీ సుబ్బారావు ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచు బేబి ప్రమేయం కూడా ఉందని విచారణలో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో ఆమెను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. కుటుంబంలో కలహాలు ఏర్పడితే మహిళలు సమీపంలోని పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఐలు సోమశేఖర్‌రెడ్డి, రామ్‌లక్ష్మీరెడ్డి, రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement