అనంతపురం రూరల్: మరో అర కిలోమీటరు వెళితే సురక్షితంగా ఇంటికి చేరుకునేవారు. అంతలోనే పెద్ద కుదుపు వచ్చింది. ఏం జరిగిందోనని తెలుసుకునే సరికి బస్సు రోడ్డుపై నుంచి కిందకు బోల్తా పడింది. 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు నెమ్మదిగా వెళుతుండటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. మరో 50 అడుగుల దూరంలో రోడ్డు నిర్మాణం కోసం తవ్విన గొయ్యి ఉంది. ఏమాత్రం వేగం పెరిగి ఉన్నా ప్రాణనష్టం భారీగా జరిగేది. అనంతపురం మండలం పూలకుంట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. వీఆర్‌ఆర్‌ఎస్ టౌన్ సర్వీసు బస్సు అనంతపురం – పూలకుంటకు రోజుకు ఐదుసార్లు తిరుగుతుంది. గ్రామస్తులు ఎక్కువగా ఈ బస్సుపైనే ఆధారపడి జిల్లా కేంద్రానికి వస్తుంటారు.
మంగళవారం మధ్యాహ్నం 30 మంది ప్రయాణికులతో అనంతపురం నుంచి పూలకుంటకు బస్సు బయల్దేరింది. మరో అర కిలోమీటరు వెళ్లి ఉంటే అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకునేవారు. సరిగ్గా 1.50 గంటల సమయంలో స్టీరింగ్ చాకప్‌పిన్ విరగడంతో బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు బోల్తాపడింది. వేగం తక్కువగా ఉండటంతో ఒక పల్టీకే బస్సు ఆగిపోయింది. ప్రయాణం చేస్తున్న పూలకుంటకు చెందిన పుల్లమ్మ, నారాయణమ్మ, గోపాల్, సాయికుమార్‌రెడ్డి, ఎరికల నారాయణస్వామిలు తీవ్రంగాను, సుబ్బక్క, శివారెడ్డి, నాగభూషణం, పార్థసారథి, మీనాక్షి, మల్లయ్య, కదిరమ్మ, రమేష్, డ్రైవర్ అబ్దుల్‌ఖాదర్, కండక్టర్ షరీఫ్‌లు స్వల్పంగాను గాయపడ్డారు. వీరిని హుటాహుటిన 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తరలించారు. వైద్యులు సమ్మెలో ఉండటంతో సకాలంలో వైద్యం అందలేదు. దీంతో బాధితుల బంధువులు వైద్యసిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
పరామర్శించిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
పూలకుంట సమీపంలో బస్సు ప్రమాదం జరిగిందనే విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హుటాహుటిన అనంత ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, యువజన విభాగం మండల కన్వీనర్ వరప్రసాద్‌రెడ్డి, పూలకుంట శివారెడ్డి, వడ్డే వెంకటనారాయణ, విద్యార్థి నాయకులు నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment