అరెస్టు వివరాలను తెలుపుతున్న జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ
కడప అర్బన్ : ప్రొద్దుటూరు పట్టణంలో 2013లో సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసుల్లో ఇద్దరు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం గ్రామానికి చెందిన పఠాన్ అబ్దుల్ కలాం గతంలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతని స్నేహితుడైన ప్రొదుటూరు మండలం ఖాదర్‌బాద్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గౌస్‌లాజం, ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన స్వర్ణకారుడు ఇషాక్‌లతో కలిసి ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని వారిని హతమార్చి దోపిడీకి పాల్పడేవారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు పట్టణం శ్రీరాంనగర్‌లో 2013లో నాలుగు నెలల వ్యవధిలో ముగ్గురు మహిళలను నిర్దాక్షిణ్యంగా గొంతు నులిమి చంపి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకుని మృతదేహాలను ఆనవాలు లేకుండా దూరంగా తీసుకుని వెళ్లి కాల్చేశారు.
♦ శ్రీరాంనగర్‌కు చెందిన భీమనపల్లె లక్ష్మిదేవిని 2013 ఫిబ్రవరి 26న దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ఆటోలో తీసుకుని వెళ్లి, ఆర్టీపిపి– సిరిగేపల్లి రోడ్డులో పెట్రోలు పోసి తగులబెట్టారు.
♦ అదే సంవత్సరం ఏప్రిల్ 30న దొరసానిపల్లె రోడ్డులో ఉన్న మేరువ శారదను దారుణంగా హత్య చేసి, బంగారు ఆభరణాలు దోచుకుని గోనెసంచిలో మృతదేహాన్ని మూటగట్టి ఆటోలో కమ్మవారిపల్లె– తాడిపత్రి రోడ్డు వరకు తీసుకుని వెళ్లి, పెట్రోల్ పోసి కాల్చివేశారు.
♦ 2013 జూన్ 2న శ్రీరాంనగర్‌కు చెందిన గొంటిముక్కల సుబ్బరంగమ్మను అదే పద్ధతిలో దారుణంగా హత్య చేసి, దగ్గరలోని మురికి కాల్వలో పడేశారు. వీరు ఇంతేగాక పలు దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడ్డారు. 2008లో కడప నగరం బాలాజీ నగర్‌కు చెందిన మునెమ్మను దారుణంగా హత్య చేసి, బంగారు నగలను కాజేశారు. పెండ్లిమర్రి ఎస్‌ఐ ఎస్‌కె రోషన్, కడప అర్బన్ సిఐ దారెడ్డి భాస్కర్ రెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసుంబాషాలు తమ సిబ్బందితో ఏడు నెలల పాటు కష్టపడి దర్యాప్తు చేసి వీరిని అరెస్టు చేశారు. కాగా మరో నిందితుడు ఇషాక్ ఓ చోరీ కేసులో ఇప్పటికే కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ, సిఐ, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment