పెళ్లి వద్దన్నందుకు ప్రాణం తీశాడు! | A psyko killed the girl in the name of love and after he did suicide | Sakshi
Sakshi News home page

పెళ్లి వద్దన్నందుకు ప్రాణం తీశాడు!

Published Sun, Dec 31 2017 2:45 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

A psyko killed the girl in the name of love and after he did suicide - Sakshi

శనివారం నెమలిపేట ప్రభుత్వ పాఠశాల వద్ద ప్రవళిక, శ్రీనివాసరావు మృతదేహాలు , శ్రీనివాసరావు(ఫైల్‌)

దమ్మపేట: పెళ్లి వద్దన్నందుకు అమ్మాయి ప్రాణాలే తీశాడో ఉన్మాది! ఆమె విద్యావలంటీర్‌గా పనిచేస్తున్న స్కూలుకు వెళ్లి మరీ గొంతులో కత్తితో పొడిచి చంపాడు. అప్పటివరకు తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటూ అన్న కోసం ఎదురుచూసిన ఆ యువతి.. ఆ అన్న కళ్లముందే విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది. యువతి నిండుప్రాణాలను బలిగొన్న ఉన్మాది కూడా అక్కడే పురుగుల మందు తాగి చనిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట శివారులోని నెమలిపేటలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. 

పెళ్లి నిరాకరించినందుకే.. 
కుక్కునూరుకు చెందిన ఊటుకూరు శ్రీనివాసరావు అశ్వారావుపేటలో నివాసముంటూ ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిషత్‌ కార్యాలయంలో యూడీసీగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె ప్రవళిక(22) నెమలిపేట ప్రాథమిక ఏకోపాధ్యాయ పాఠశాలలో విద్యా వలంటీర్‌గా పనిచేస్తోంది. కుక్కునూరుకే చెందిన వనమా వెంకటేశ్వరరావు కొడుకు శ్రీనివాసరావు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం ఉంది. ప్రవళ్లికను తన కొడుక్కి ఇచ్చి వివాహం చేయాలని వెంకటేశ్వరరావు కుటుంబీకులు గతంలో ఆమె తల్లిదండ్రులను అడిగారు. అయితే ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన లేదని వారు చెప్పారు. తర్వాత ప్రవళ్లికకు అశ్వారావుపేటకు చెందిన మరో యువకుడితో వివాహం నిశ్చయమైంది. దీంతో తనతో పెళ్లికి నిరాకరించిన ప్రవళికను చంపాలని శ్రీనివాసరావు నిర్ణయించుకున్నాడు. 

పథకం ప్రకారమే.. 
శనివారం నెమలిపేటలో ప్రవళిక పనిచేస్తున్న పాఠశాలకు శ్రీనివాసరావు వచ్చాడు. ముందుగా ఆమెతో మాటామాటా కలిపాడు. తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. అతడి ప్రవర్తనతో భయపడిపోయిన ప్రవళిక పాఠశాల గదిలోకి వెళ్లి గడియ పెట్టింది. వెంటనే తన సోదరుడు ప్రేమ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి శ్రీనివాసరావు వచ్చి బెదిరిస్తున్న విషయాన్ని చెప్పింది. దీంతో వెంటనే అతడు నెమలిపేట చేరుకున్నాడు. కిటికీలో నుంచి సోదరుడిని చూడగానే తలుపు తెరిచి పరిగెత్తే ప్రయత్నం చేసింది.

అక్కడే ఉన్న శ్రీనివాసరావు ఆమె జుట్టు పట్టుకుని వెంట తెచ్చుకున్న కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. ప్రేమ్‌కుమార్‌ బైక్‌ దిగి వచ్చేలోపే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ వెంటనే పురుగుల మందుతాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గొంతు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రవళిక విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలింది. దాడికి ముందు శ్రీనివాసరావు ప్రవళికతో ఘర్షణ పడ్డాడు. పాఠశాల వెనుక వైపు ఆమె చేతి గాజులు పగిలి ఉండటం, వెంట తెచ్చుకున్న కొత్త కత్తిని అక్కడే ఓపెన్‌ చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. విగతజీవిగా పడి ఉన్న ప్రవళికను చూసిన సోదరుడు, తండ్రి, మిత్రులు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. సంఘటనా స్థలాన్ని అశ్వారావుపేట సీఐ రవికుమార్‌ పరిశీలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement