
శైలేశ్, నందిని.. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్న డిపాజిట్ దారులు
సాక్షి, హైదరాబాద్: రిషబ్ చిట్‌ఫండ్స్ ముసుగులో చిట్టీల పేరుతో వందల మందిని మోసం చేసిన ఘరానా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో చిట్‌ఫండ్స్ యజమాని శైలేశ్ కుమార్ గుజ్జర్.. ప్రజల నుంచి దాదాపు రూ.200 కోట్ల వరకు వసూలు చేసి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న శైలేష్‌తో పాటు అతడి భార్య నందినిని అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని దాదాపు 50 మంది బాధితులు బుధవారం సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి, అదనపు డీసీపీ జోగయ్యలను కలిశారు.
విలాసవంతమైన జీవితం..
డిపాజిట్‌దారుల డబ్బుతో శైలేశ్ విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు అనేక చోట్ల స్థిర, చరాస్తులు కొన్నారు. రూ.50 లక్షల విలువైన ఆడి కారుతో పాటు మరో మూడు ఖరీదైన కార్లు ఉండేవి. రూ.30 కోట్లతో గోవాలో క్యాసినో, హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్ నడిపిం చాడు. బోయిగూడలో ఇల్లు, బట్టలబజార్‌లో దుకాణాలు, బెంగళూరులో 1,600 గజాల స్థలం, నల్లగండ్లలో 1,200 గజాల స్థలం శైలేశ్ కొనుగోలు చేసిన వాటిలో కొన్ని. పథకం ప్రకారం శైలేశ్ తన ఇం టిని ఓ బ్యాంకులో కుదువపెట్టి రూ.60 లక్షల అప్పు తీసుకున్నాడు. శైలేశ్ వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన కొందరు బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వా లంటూ ఒత్తిడి తెచ్చారు. అయితే వారికి నమ్మకం కలిగేందుకు తన కేసినోలు, పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌లో ఉన్న షేర్ల విషయం చెప్పేవాడు.
ఇంట్లో పనివాళ్ల దగ్గర కూడా..
తన ఇంట్లో పనిచేసే పనివాళ్లను కూడా శైలేశ్ మోసం చేశాడు. ఓ మహిళ రూ.2లక్షల చిట్టీ వేయగా అది కూడా చెల్లించలేదు. పోలీసులకు ఇప్పటి వరకు ఆధారాలతో రూ.53 కోట్లకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. అదనంగా మరో 600 మంది బాధితులు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. శైలేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దేశం విడిచి పారిపోకుండా అతడిపై లుక్‌ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు.
నమ్మకంగా ఉంటూ..
ఓల్డ్‌బోయిగూడకు చెందిన శైలేశ్ గుజ్జర్, అతడి భార్య నందినితో కలసి 1998లో రిషబ్ చిట్‌ఫండ్ సంస్థను స్థాపించాడు. చిట్టీలతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా సేకరించాడు. చిట్టీ వేసిన వారు అది పాడుకున్న తర్వాత వచ్చిన డబ్బును ఇవ్వకుండా తన వద్దే ఫిక్సిడ్ డిపాజిట్ చేయించుకునేవాడు. 20 ఏళ్లుగా నమ్మకంగా ఉంటుండటంతో దాదాపు వెయ్యి మంది రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలు వేశారు. చిట్టీలు పూర్తయిన వారికిరూ.2 వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికి తన వద్దే డిపాజిట్ చేయించేసుకున్నాడు. కొన్నాళ్లు సరిగ్గానే శైలేశ్ వడ్డీ చెల్లించాడు. రెండు, మూడేళ్లుగా వడ్డీలు, చిట్టీలు పాడుకున్న వారికి డబ్బు చెల్లించట్లేదు. ఇటీవల శైలేష్ కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు మహంకాళి పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తు కోసం సీసీఎస్‌కు బదిలీ అయింది.
Comments
Please login to add a commentAdd a comment