అంతర్ జిల్లా నేరస్తులను విలేకరులకు చూపిస్తున్న అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి
రాజమహేంద్రవరం క్రైం: చోరీ కేసుల్లో అంతర్ జిల్లా నేరస్తులు నలుగురిని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలను ఎస్పీ ఇలా వెల్లడించారు. మూడు నెలలుగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని అపార్ట్‌మెంట్‌లలో జరుగుతున్న చోరీలపై రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ జె.కుల శేఖర్, వన్‌టౌన్ ఇనస్పెక్టర్ ఎం. రవీంద్ర, ఎస్సై రాజ శేఖర్ వారి సిబ్బంది నిఘా ఉంచి గోదావరి గట్టున రామకృష్ణ మఠం వద్దగల ఇసుక ర్యాంప్ వద్ద పలువురిని అరెస్టు చేసినట్టు తెలిపారు.
వారిలో చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడు తెలంగాణ రాష్ట్రం, మహబుబ్ నగర్‌కు చెందిన ఆవుల కిరణ్ కుమార్ అలియాస్ రాహుల్, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు గ్రామానికి చెందిన కోరుమిల్లి సత్య సాయి పాండురంగ విఠల్, ఉర్ల శ్రీనివాసరావు, మానేపల్లి వీర వెంకట సూర్య సత్య నాగ మోహన్ గుప్త ఉన్నారని పేర్కొన్నారు. నిందితులు హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వీరు ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి అపార్ట్‌మెంట్‌లలో పగటి పూట చోరీలకు పాల్పడుతుంటారని తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ప్రకాష్ నగర్ పరిధిలో ఏడు, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీ మొత్తం 16 చోరీలు చేశారని తెలిపారు.
రూ 36 లక్షల విలువైన నగలు స్వాధీనం
నిందితుల వద్ద నుంచి కేజీ బంగారు నగలు, ఆరు కేజీల వెండి వస్తువులు మొత్తం రూ.36 లక్షల విలువైన నగలు, యాక్టివా మోటారు సైకిళ్లు రెండు, ఐదు మొబైల్ ఫోన్లు, 63 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆవుల కిరణ్ కుమార్ పాత నేరస్తుడని, ఇతడిపై 70 చోరీ కేసులు ఉన్నాయని వివరించారు. నిడదవోలు గ్రామానికి చెందిన ఉర్ల శ్రీనివాస్ సైకిళ్ల చోరీలతో పాటు రైలులో సూట్ కేసులు చోరీ చేసిన కేసులు ఉన్నాయని తెలిపారు.
ఐదు, పది నిమిషాల్లో తుడిచిపెట్టేస్తారు
ఈ నలుగురు నిందితులు చోరీలకు అలవాటు పడ్డారని తెలిపారు. అపార్ట్‌మెంట్‌లో తలుపులను ఐరన్ రాడ్‌తో గొళ్లాలను తొలగించి ఇంటి యజమానులు వచ్చే లోపు ఐదు, పది నిమిషాల్లో ఇంట్లో ఉన్న వస్తువులు చోరీ చేస్తుంటారని తెలిపారు.
పోలీసులకు రివార్డులు
నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సై సీహెచ్ రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, ఎస్.వీరబాబు, బి.నెహ్రూ, వి.సురేష్, డి.శ్రీనివాస్‌లకు రివార్డులు ఇస్తామని తెలిపారు. సిబ్బందిని అభినందించారు. సమావేశంలో ఎస్‌బీ డీఎస్పీ రామకృష్ణ, సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment