సాక్షి, విజయవాడ: ఇటీవల నగరంలో సంచలనం రేపిన తెనాలి రౌడీషీటర్ వేమూరి సుబ్రమణ్యం అలియాస్ సుబ్బు హత్యకేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హత్యోదంతం తీరును పోలీసులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ గజరావుభూపాల్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. కేసులో గురువారం ఐదుగురు నిందితులు పోలీసులకు లొంగిపోగా, శుక్రవారం మరో నిందితుడు విజయవాడ పోలీసుల వద్ద హాజరైనట్లు తెలిసింది.
మొత్తం ఏడగురు నిందితులు
దహత్యకేసులో మొత్తం 7గురు నిందితులు పాల్గొన్నట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు లడ్డుగా గుర్తించారు. సుబ్బు అన్న సత్యనారాయణ హత్యకేసులో లడ్డు ప్రధాన నిందితుడు. ఈ క్రమంలో కొద్దికాలంగా సుబ్బు, లడ్డు ఒకరినొకరు చంపుకునేందుకు పధకాలు రచించుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. హత్య జరిగిన వెంటనే నిందితులు చుట్టగుంట నుంచి ఏలూరు రోడ్డు మీదుగా మ్యూజియం రోడ్డు మీదగా బందరు రోడ్డులోకి ప్రవేశించి రామలింగేశ్వరనగర్ కట్టమీద నుంచి అవనిగడ్డ మీదుగా పరారయ్యారు.
బైక్‌లను వదిలేసి.. పరారయ్యారు
ఈదారిలో మ్యూజియం రోడ్డు వద్ద ఒకబైక్‌ను, అవనిగడ్డ బ్రిడ్జివద్ద మరో బైక్‌ను నిందితులు వదిలివెళ్లారు. పోలీసులు ఆ రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దారిలో కృష్ణానదిలో 6కత్తులను రెండు చోట్ల పడేశారు. ఒక కత్తిని పోలీసులు సంఘటాన స్థలంలో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కత్తుల కోసం కృష్ణానది ప్రాంతంలో గాలిస్తున్నారు. కాగా మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
‘ఆరు’ చిత్రంలోలా..
సూర్య హీరోగా నటించిన ఆరు మూవీలో నిందితులు చెన్నైలో హత్య చేసి తిరుమలలో గుండు గీయించుకున్నారు. అదే తరహాలో సుబ్బు హత్యకేసులో 4గురు నిందితులు విజయవాడలో హత్య చేసి ద్వారకా తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామికి తలనీలాలు సమర్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కాగా పోలీసులు నిందితులను విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఓ మారుమూల పోలీసుస్టేషన్ ఏరియాలో ఉంచి విచారణ చేస్తున్నారు. నిందితులపై నేరం రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. నిందితులంతా 25నుంచి 30ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు కావటంతో హత్య జరిగిన వెంటనే సునాయాసంగా తప్పించుకుని పరారయ్యారు. కేసును విజయవాడ శాంతి భద్రతల విభాగం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment