పోలీస్ స్టేషన్‌లో హర్షితా రెడ్డి, సామ్రాట్ రెడ్డి ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్ : చీటికిమాటికి చిరాకు పడుతూ, చేతికిదొరికిన వస్తువులతో కొడుతూ, నోటికొచ్చినట్లు తిడుతూ సామ్రాట్ టార్చర్ పెట్టేవాడని భార్య హర్షితా రెడ్డి చెప్పారు. ఇకనైనా మరతాడని ఎంతోకాలం ఓపికపట్టానని, బాధ భరింలేని స్థితిలో బయటికి వచ్చానని అన్నారు. తన భర్త, టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిపై కేసులు పెట్టిన హర్షిత.. మంగళవారం మాదాపూర్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ గోడు వెళ్లబోసుకున్నారు.
‘‘రెండేళ్లు నరకం అనుభవించా :సామ్రాట్‌తో నా వివాహం జరిగి రెండేళ్లైంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం గురించి గొడవలు మొదలుపెట్టారు. అస్తమానం డబ్బులు, నగలు కావాలని అడిగేవాళ్లు. సామ్రాట్ నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నా వాళ్లమ్మ అడ్డు చెప్పకపోయేది. ఫ్యామిలీమెంబర్స్ ముందే నన్ను ఎన్నోసార్లు కొట్టేవాడు. చేతికి ఏది దొరికితే దాన్ని విసిరేసేవాడు. కుర్చీలు, సోఫాలను ఎత్తిపడేసేవాడు. ఇంత జరుగుతున్నా అతనిది తప్పని చెప్పేవాళ్లేలేరు. నా పేరుమీదున్న ఆస్తుల్ని అతనికి రాసివ్వకుంటే బ్రేకప్ అవుతానని బెదిరించేవాడు. సామ్రాట్ కుటుంబం ఒక దశలో నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు. పరిస్థితి దారుణంగా మారడంతో మా ఇంట్లోవాళ్లకు చెప్పాను. అలా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో వాళ్లపై కేసు పెట్టాం. కౌన్సిలింగ్ తర్వాత.. నన్ను మాదాపూర్‌లోని వేరే ఇంట్లో ఉంచాడు. ఎప్పుడోగానీ ఇంటికి వచ్చేవాడుకాదు, వచ్చినా తిట్టి,కొట్టి వెళ్లేవాడు..
డ్రగ్స్, హుక్కా అతని రెగ్యులర్ హ్యాబిట్స్ : అందరిముందు మంచివాడిలా నటించే సామ్రాట్.. నాతో మాత్రం అంత సైకిక్‌గా ఎలా బిహేవ్ చేసేవాడో మొదట్లో అర్థంకాలేదు. తర్వాత తెలిసిందేమంటే.. అతనికి లేని చెడు అలవాటులేదు. రెగ్యులర్‌గా హుక్కా సెంటర్లకు వెళతాడు. నాకు ఇష్టంలేదని చెప్పినా బలవంతంగా ఓ హుక్కా సెంటర్‌కు తీసుకెళ్లాడు. ఆ వాసనకు ఊపిరాడక నేను బయటికొచ్చేశాను. సామ్రాట్‌కు డ్రగ్స్ కూడా అలవాటుంది. పెద్ద వుమనైజర్. నా పక్కన కూర్చొనే వేరే అమ్మాయిలను ఫ్లర్ట్ చేసేవాడు. మొత్తంగా ఆయన స్వేచ్ఛకు నేను అడ్డుగా ఉన్నాను కాబట్టి, అగిడినట్లు ఆస్తులు రాసివ్వలేదు కాబట్టి నన్ను చంపడం లేదా వదిలించుకోవాలని అతను భావించాడు.
ఆధారాలు లేకుండా చేద్దామనుకున్నాడు : నా సేఫ్టీ కోసమని ఇప్పుడుంటున్న ఇంటి బయట మా వాళ్లు సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. సామ్రాట్ ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు వెళ్లేది అంతా రికార్డయింది. నన్ను వదిలించుకోవాలని పూర్తిగా నిర్ణయించుకున్నాడు కాబట్టే.. నా ఇంట్లో అతనికి సంబంధించిన ఆధారాలను చెరిపేద్దామనుకున్నాడు. నేను ఇంట్లో లేనప్పుడు వాళ్ల అక్కతో కలిసి వచ్చి.. సీసీటీవీ రికార్డులను, అతని వస్తువులను తీసుకొని వెళ్లిపోయాడు. పెళ్లన్నా, భార్యన్నా ఏమాత్రం బాధ్యతలేని వ్యక్తి నుంచి నన్ను కాపాడేది ఎవరు, అందుకే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించా’’ అని హర్షితా రెడ్డి చెప్పారు.
మనం ఏ జనరేషన్‌లో ఉన్నాం? : మీడియాతో మాట్లాడుతూ హర్షితా రెడ్డి పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. ‘పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరా? ఎల్లకాలం భరించడానికి నేను బొమ్మనా? మగపిల్లల్ని ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చెయ్యడం పేరెంట్స్ బాధ్యత కాదా? అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో దయచేసి మగపిల్లలకు పిల్లలకు నేర్పించండి.. ఒకవేళ వాళ్లు మాట వినకుంటే దండించండి. మనం ఏ జనరేషన్‌లో ఉన్నామో కాస్త ఆలోచించండి..’ అంటూ హర్షితా కన్నీటిపర్యంతమయ్యారు.
సామ్రాట్ గే! : హీరో సామ్రాట్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు హర్షిత తండ్రి మధుసూదన్. ‘‘పెళ్లికి ముందు మాకు చాలా అబద్ధాలు చెప్పారు. సినిమాలు మానేశాడని, బిజినెస్ చేస్తున్నాడని, త్వరలో ఓ హోటల్ కూడా కట్టాలనుకుంటున్నాడని మధ్యవర్తి చెప్పాడు. తర్వాత తెలిసిందేమంటే సామ్రాట్ గే అని! నా కూతురిని ఏనాడూ సంతోషపర్చలేదు. ఆస్తుల్ని తన పేరున రాయలని కొట్టేవాడు. చాలా కాలంపాటు ఈ విషయాలేవీ మా అమ్మాయి చెప్పలేదు. చివరికి ఒకసారి తలదిండుతో హర్షితను చంపాలని చూశారు. సడన్‌గా పనిమనిషి రావడంతో నా కూతురు ఆ గండం నుంచి బయటపడింది’’ అని మధుసూదన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment