ప్రమాదంలో పసిమొగ్గలు | School Bus Accident in Guntur | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో పసిమొగ్గలు

Published Tue, Jan 29 2019 1:22 PM | Last Updated on Tue, Jan 29 2019 1:22 PM

School Bus Accident in Guntur - Sakshi

బస్సు బోల్తా పడిన ప్రాంతంలో గుమికూడిన జనం

సాక్షి, గుంటూరు: ‘జిల్లాలో అన్ని బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు దాదాపుగా ముగిశాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. తేడా అనిపిస్తే యాజమాన్యానికి నోటీసులిస్తాం. నిబంధనలు పాటించని బస్సులను సీజ్‌ చేస్తాం. అప్పటికి దారికి రాకపోతే స్కూల్‌ అనుమతి రద్దుకు సిఫార్సు చేస్తాం’... ఇవి నిత్యం రవాణాశాఖ అధికారుల నోట వినిపించే మాటలు కానీ అచరణలో మాత్రం ఫలితాలు కన్పించడం లేదు. జిల్లాలో నిత్యం పాఠశాల బస్సులకు జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే వీరి మాటలన్నీ నీటి మూటలేనని స్పష్టమవుతోంది.   

మాచర్ల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ బస్సు మండలంలోని మాచర్ల–మండాది మధ్యలోని శ్రీశైలం రహదారిలో కానవాగు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 32 మంది గాయపడగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు, మండాదిలో విద్యార్థులను ఎక్కించుకుని కానవాగు వద్ద బస్సు స్టీరింగ్‌ రాడ్‌ ఊడిపోవటంతో బస్సు వంతెన పైనుంచి వాగులోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనతో పిల్లలను ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు, ఆటోల్లో పంపించే తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.
పరిమితికి మించి

పిల్లలను ఎక్కిస్తున్న వైనం
జిల్లాలో రెండు వేలకుపైగా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు బస్సులు, ఆటోల్లో పిల్లలను  తరలిస్తున్నాయి. వీటిలో చాలా వరకూ వాహనాలు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ యాజమాన్యాలు పిల్లల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. ఇదంతా తెలిసినా ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం బస్సులో 57 మంది విద్యార్థులను ఎక్కించాలి. కానీ మందాడి వద్ద ప్రమాదం జరిగిన బస్సుల్లో 80 మంది విద్యార్థులను తరలిస్తున్నారు.    

అంతులేని నిర్లక్ష్యం
నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల తన బస్సు, ఆటోల వెహికల్‌ ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టును, డ్రైవర్‌ హెల్త్‌ కండీషన్‌ను తల్లిదండ్రుల సమావేశంలో ఉంచాలి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పేరెంట్‌ మీటింగ్‌ జరుగుతున్న దాఖలాలు లేవు. అడపాదడపా తనిఖీలు జరిగినా జరిమానాలతో సరి పెడుతున్నాయి. దీంతో చాలా ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లు, రేడియం స్టిక్కర్లు లేవు.రవాణా అధికారులు కాసుల కక్కుర్తితో ఏజెంట్ల ద్వారా వచ్చే బస్సులకు ఎటువంటి తనిఖీలు లేకుండా సర్టిఫికెట్‌ ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సత్తెనపల్లి, మాచర్ల, బాపట్ల, తెనాలి, పిడుగురాళ్ల, పొన్నూరు, మంగళగిరి సహా జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలు క్లీనర్లచే బస్సులు నడుపుతున్నాయి.

తనిఖీలు నిర్వహిస్తున్నాం..
నిబంధనల విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తున్న వాహనాలపై కేసులు రాస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో మొదటిసారి సీటు బెల్టు విధానాన్ని ప్రవేశ పెట్టాం. వచ్చే విద్యా సంవ్సరంలో అన్ని పాఠశాల బస్సులకు ఈ విధానాన్ని అమలు చేసేలా చూస్తున్నాం. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.– రాజారత్నం, డీటీసీ గుంటూరు

తల్లిదండ్రులారా.. ఆరా తీయండి
18 సీట్లలోపు స్కూల్‌ బస్‌ నడిపే డ్రైవర్‌కు లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌తోపాటు బ్యాడ్జి నంబర్‌ ఉండాలి. అంతకు మించిన సామర్థ్యం ఉన్న పెద్ద బస్సుల డ్రైవర్లకు హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ లైసెన్స్‌తోపాటు బ్యాడ్జి నెంబర్‌ ఉండాలి. బస్సు కెపాసిటీని బట్టి డ్రైవర్‌ను ఎంపిక చేసుకోవాలి. డ్రైవర్‌లు మారుతున్నప్పుడు వారి లైసెన్సు వివరాలను తెలుసుకోవాలి. రవాణా శాఖ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మోటారు వాహనాల చట్టం 1989, రూల్‌ 185 సవరణ తుది నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల బస్సుల భధ్రతకు సంబంధించి ఫిట్‌నెస్‌ సర్టిఫికేషన్‌తోపాటు తీసుకోవాల్సిన 32 ఆంశాలపై జీవోలో పొందు పరిచారు. వీటిలో ఏ ఒక్కటి పాటిచకపోయినా నిలదీయొచ్చు.

జిల్లాలో స్కూల్‌ బస్సు, ఆటో ప్రమాదాలు ఇలా..
2015 ఫిబ్రవరిలో మంగళగిరి మండలం నూతక్కి దగ్గర ఓ ప్రైవేటు బస్సు కాల్వలో బోల్తా పడి రెండో తరగతి విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
2016 ఏప్రిల్‌లో పొన్నూరు మండలం జూపూడి వద్ద స్కూల్‌ బస్‌ నుంచి రెండో తరగతి విద్యార్థి జారి పడి మృత్యువాత పడింది. ఇదే సంవత్సరం మార్చిలో చెరుకుపల్లి మండలం కామినేనిపాలెం వద్ద ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుకు బ్రేక్‌ ఫెయిలై బోల్తా పడింది.  
2018 అక్టోబర్‌ 31న దాచేపల్లి మండలం అలుగుపల్లిపాడు వద్ద ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు బోల్తా పడి ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు.
2018 ఆగస్టులో యడ్లపాడు, సొలస గ్రామాల్లో స్వల్ప రోజుల వ్యవధిలోనే రెండు ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు ప్రమాదానికి గురై విద్యార్థులు గాయాలపాలయ్యారు.

విద్యార్థులకు డీఈవో పరామర్శ
నరసరావుపేట రూరల్‌: బస్సు ప్రమాదంలో గాయపడి పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ జీహైమావతిలు సోమవారం రాత్రి పరామర్శించారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. వారి వెంట ఎంఈవో జ్యోతికిరణ్, బాలుర హక్కుల పరిరక్షణ కమిషన్‌ ప్రతినిధి పీ పద్మలత తదితరులు ఉన్నారు.

కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ను మూసేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్‌: కండీషన్‌లో లేని బస్సులో విద్యార్థులను తరలిస్తూ ప్రమాదానికి కారణమైన కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ను మూసేయాలని గిరిజన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు కేతావత్‌ పాండునాయక్‌ సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వలనే ప్రమాదం చోటు చేసుకుందని మండిపడ్డారు. తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్న యాజమాన్యాలు కాలం చెల్లిన బస్సులతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement