
రాజాపూర్(జడ్చర్ల): అతివేగం ఓ ప్రమాదానికి కారణమైంది. అదృష్టవశాత్తు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డ ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్లలోని లోటస్ స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సులో బుధవారం బ్లాక్‌డే కావడంతో ముందుగానే వదిలారు. దీంతో 20 మంది విద్యార్థులతో బయలుదేరిన స్కూల్ బస్సు కొందరిని రాజాపూర్‌లో దించాక, ముదిరెడ్డిపల్లి, ఈర్లపల్లి, కోడ్గల్ గ్రామాలకు బయలుదేరింది. ఈ క్రమంలో రాజాపూర్ శివారులోని కోల్డ్‌స్టోరేజ్ వద్ద జాతీయ రహదారిపై స్కూల్ బస్సును హైదరాబాద్ నుండి రాయచూర్ వైపు వెళ్తున్న కర్నాటక ఆర్టీసీ బస్సు వెనక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు రోడ్డు పక్కన గుంతలో పడగా.. 8 మంది విద్యార్థులు, ఆరుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. స్కూల్ బస్సు పక్కనే ఉన్న గుంతలో పడగా.. బోల్తా కొట్టకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో విద్యార్థులు శివకుమార్, లక్కి, గణేష్ గాయపడగా.. మరొకరికి కాలు విరిగింది.
పక్కనే ట్రాన్స్‌ఫార్మర్...
ఆర్టీసీ బస్సు ఢీకొనగానే స్కూల్ బస్సు ఏసీ గోదాం కాంపౌండ్ వద్దకు వెళ్లి ఆగిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి అక్కడి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తాకితే పెద్ద ప్రమాదం చోటుచేసుకునేది. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ పిల్లల క్షేమసమాచారాలపై ఆరా తీశారు. కాగా, సకాలంలో అంబులెన్స్‌లు ఆలస్యంగా రాగా.. కొందరిని మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ ఆస్పత్రికి, ఇంకొందరిని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరామర్శించి మంత్రి లక్ష్మారెడ్డి..
బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్ ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్న ఆయన.. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు. మంత్రి వెంటజెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
తల్లడిల్లిన తల్లిదండ్రులు
మహబూబ్‌నగర్ రూరల్: రాజాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన లోటస్ స్కూల్ విద్యార్థులు ఎనిమిది మందిని మహబూబ్‌నగర్ ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల రోధనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. అయితే, తమ పిల్లలకు ప్రాణాపాయం లేదని చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్‌వీఎస్‌లో విద్యార్థులు శ్రీరాం, శివకుమార్, గణేష్, వి.శివకుమార్, అర్చనతో పాటు మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.