రోదిస్తున్న మృతుల మిత్రుడు హుస్సేన్
వైఎస్‌ఆర్ జిల్లా, రాయచోటిటౌన్ : ఈత సరదా ఇద్దరు విద్యార్థులను బలి తీసుకుంది. సరదాగా కాలక్షేపం చేయాలనుకున్న వారి నిండునూరేళ్ల జీవితం నీటి మడుగులో కలిసిపోయింది. తమ కళ్లెదుట తిరిగినా పిల్లలు గంట వ్యవధిలో విగతజీవులుగా కనిపించడంతో ఒక్కసారిగా వారి నోట మాట రాలేదు. తమకు కడుపుకోత మిగిలిందని తెలుసుకొన్న ఆ తల్లిదండ్రుల రోదన మిన్నటింది. రాయచోటి పట్టణ పరిధిలోని చెక్‌పోస్టు సమీపంలోని గులాబ్‌జాన్, అక్బర్ బాషాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నవాడైన ఇనాయత్ (14), అదే ప్రాంతంలో డిగ్రీ చదివే వాహీదా, ఖాదర్‌బాషాల కుమారుడు ఇందాద్ ( 19), హుస్సేన్ మిత్రులు. స్కూల్ అయిపోగానే అందరూ కలిసి సరదాగా ఆడుకోవడం వీరికి అలవాటు. ఈ క్రమంలో సోమవారం ముగ్గురు కలిసి ఈతకెళ్లాలని నిర్ణయించుకున్నారు.ముందుగా హోటల్‌కు వెళ్లి కుష్కా ప్యాక్ చేయించుకొని పట్టణ సమీపంలోని యానాదికాలనీ వద్ద ఉన్న సద్దుకూళ్లవంక వద్దకు వెళ్లారు.
అక్కడ తెచ్చుకున్న కుష్కాను తిన్నారు. ఈ కుష్కానే వారికి చివరి ఆహారమని తెలియదు పాపం. తిన్న కొద్దిసేపటికి ఈత కొట్టేందుకు వెళ్లారు. నదిలో (మడుగులో) ఒకరి తర్వాత ఒకరు దూకారు. హుస్సేన్ మడుగు దగ్గరలోనే దూకడంతో వెంటనే బయటకు చేరాడు. మిగిలిన ఇద్దరు మిత్రులు మడుగు మధ్య వరకు వెళ్లడంతో అక్కడ లోతైన పూడికలో కూరుకపోయారు. మడుగులోకి దూకిన మిత్రులు బయటకు రాకపోవడంతో హుస్సేన్ రోదిస్తూ సాయం కోసం కేకలు వేశాడు. నలుగురు వ్యక్తులు అక్కడికి చేరుకొని వారిని ఊబిలోనుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఇద్దరు మృతి చెందారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చేరవేశారు. వారు అక్కడికి చేరుకొని మృతదేహాలను తీసుకెళ్లారు. కళ్లెదుటే వారి బిడ్డలు కానరాని లోకాలకు వెళ్లడంతో బోరున విలపించారు.
ఇనాయ్‌త్ తండ్రి అక్బర్‌బాషా జీవనోపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితం సౌదీకి వెళ్లాడు. అక్కడ తోటలలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను అందరినీ మంచిగా చదించాలనే ఆశతో ఆయన విదేశాలలో కూలి పనులు చేస్తున్నాడు. మృతుడి తల్లి గులాబ్‌జాన్ పిల్లలను చూసుకొంటూ ఇంటిలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో చిన్న కుమారుడు ఇక లేడనే విషయాన్ని తన భర్తకు ఎలా చెప్పాలని రోదిస్తున్నారు.
ఇందాద్ స్వగ్రామం చిత్తూరు జిల్లా కలకడ మండలం నూతనకాల్వ. చదువు కోసం రాయచోటిలోనే చిన్నతనం నుంచి తాత ( అమ్మనాన్న) వద్ద ఉంటున్నాడు. రాయచోటిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చదువు పూర్తిగా కాగానే ఏదైనా ఉద్యోగంలో చేరి వృద్ధాప్యంలో తనకు అండగా ఉంటాడనే భావించిన తాతకు కన్నీళ్లను మిగిల్చాడు. మనవడిని తన వడిలో పెట్టుకొని ఒరే నాన్నా నీవు లేకుండా నేనెలా బతకాలరా .. నా కూతురు వచ్చి నా బిడ్డ ఏడని అడిగితే ఏమని చెప్పాలి నాన్నా... అంటూ రోదిస్తున్న తాతను సముదాయించడం ఎవరి తరం కాలేదు.