మృతి చెందిన ఎస్‌ఐ కనకల విశ్వనాథ్, (ఇన్‌సెట్లో) విశ్వనాథ్(ఫైల్)
విధి బలీయమైనది. కుటుంబ రక్షణతో పాటూ తోటి వారికి సేవ చేయాలనే తపనతో పోలీసు ఉద్యోగంలోకి వచ్చి మరి కొన్నాళ్లకు పదవీ విరమణ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని లారీ మృత్యు రూపంలో కబళించింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సౌమ్యుడిగా పేరొంది తోటి మిత్రులతో కలివిడిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుని కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ కేడర్ వరకూ ఎదిగి, మరికొద్ది రోజుల్లో సీఐ ప్రమోషన్ కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని మృత్యువు కబళించిందని తెలియగానే జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్ఘాంతపోయింది. కన్నీటితో తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
గజపతినగరం/విజయనగరం టౌన్ : విజయనగరం పోలీస్ శిక్షణా కళాశాలలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కనకల కాశీవిశ్వనాథ్ (59) బొబ్బిలిలో ఉంటున్న తన కుమారుడి ఇంటికి ఆదివారం ఉదయం వెళ్లారు. కుమారుడు ఇళ్లు మారుతున్న నేపథ్యంలో సహాయం చేశారు. సోమవారం పీటీసీలో మరలా యథావిధిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున ఆదివారం సాయంత్రం బొబ్బిలి నుంచి పల్సర్ బైక్‌పై విజయనగరం బయలుదేరారు. బొండపల్లి మండలం అంబటివలస గ్రామ సమీపం మలుపు వద్ద విజయనగరం నుంచి బొబ్బిలి వైపు అతివేగంతో వెళ్తున్న లారీ బలంగా ఢీకొంది. అదే సమయంలో వర్షం పడుతుండడంతో కింద పడిపోయిన విశ్వనాథ్ ఛాతి మీదుగా తలపై నుంచి లారీ వెళ్లిపోయింది. అదే విధంగా బైక్‌తో పాటూ ఆయన్ను ఈడ్చుకుపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య అంజలి, ముగ్గురు కుమారులు ఉన్నారు. బొబ్బిలి పుడ్ కార్పొరేషన్‌లో అవుట్ సోర్సింగ్‌లోనూ విధులు నిర్వహిస్తున్నారు. మూడో కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. పట్టణంలోని నాగవంశపు వీధిలో కుటుంబంతో నివాసముంటున్నారు. బొండపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ స్థాయి క్రీడాకారునిగా...
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్‌ఐ కనకల విశ్వనాథ్ జాతీయ స్థాయి క్రీడాకారునిగా మంచి గుర్తింపు పొందారు. ప్రముఖ కబడ్డీ ప్లేయర్ భగవాన్‌దాస్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో కబడ్డీ ఆటను ఆడి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారు. 1983లో కానిస్టేబుల్‌గా పోలీస్ ఉద్యోగంలో చేరిన ఈయన అంచెలంచెలుగా ఎదిగారు. పీటీసీకి రాక ముందు గంట్యాడ హెచ్‌సీగా, ఎస్‌బీ ఏఎస్‌ఐగానూ, కోర్టు లైజినింగ్ అధికారిగా, విజయనగరం, గజపతినగరంలో ఏఎస్‌ఐగా పని చేశారు. నాలుగు నెలల క్రితమే ఎస్‌ఐగా ప్రమోషన్ వచ్చింది. ఏఎస్‌ఐ నుంచి ప్రమోషన్ తీసుకుని పీటీసీలో ఎస్‌ఐగా చేరారు. సీఐ ప్రమోషన్‌లో ఉన్నారు. పీటీసీలో క్రైమ్ ఇన్విస్టిగేషన్‌లో కానిస్టేబుల్స్‌కి శిక్షణ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment