ప్రతీకాత్మక చిత్రం
జియాగూడ: కుమార్తెకు పాలు తీసుకువచ్చేందుకు వెళ్లిన వ్యక్తిని ఓ ఎస్‌ఐ చితకబాదిన ఘటన ఇందిరానగర్‌లోని కంటైన్మెంట్ జోన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. కంటైన్మెంట్ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సింది పోయి అదే బస్తీకి చెందిన రాజు అనే వ్యక్తికి బారికేడ్ తాళాలు అప్పగించారు. బుధవారం స్థానికంగా ఉంటున్న శేఖర్ తన కుమార్తె మాళవిక పాలు కావాలని ఏడుస్తుండగా తీసుకురావడానికి కంటైన్మెంట్ బారికేడ్ల వద్దకు వచ్చి.. తాళాలు తీయాలని రాజును కోరాడు. ఇందుకు రాజు ఒప్పుకోలేదు. దీంతో బారికేడ్లు దాటేందుకు శేఖర్ యత్నించగా అక్కడే ఉన్న మరో వ్యక్తి బయటకు వెళ్లవద్దని అడ్డుకున్నాడు. దీంతో అతడికి, శేఖర్‌కు మధ్య గొడవ జరిగింది.
ఈ గొడవను రాజు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి కుల్సుంపురా ఎస్‌ఐ అభిషేక్‌కు పంపించాడు. ఈ వీడియోను చూసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ శేఖర్‌ను లాఠీతో చితకబాదాడు. ఎస్‌ఐని అడ్డుకునేందుకు శేఖర్ భార్య, తల్లి ప్రయత్నించారు. ఈ ఘటనలో శేఖర్ భార్య చేతిలో ఉన్న రెండేళ్ల పాపకు సైతం లాఠీ దెబ్బలు తగిలాయి. ఈ విషయమై శేఖర్ కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అంగీకరించలేదు. దీంతో గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment