ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్ సభ్యులు
గుంటూరు, బెల్లంకొండ(పెదకూరపాడు): ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలోని మన్నెసుల్తాన్‌పాలెం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గ్రామానికి చెందిన చేవూరి సీతారావమ్మ(45)గా గుర్తించారు. మృతురాలి భర్త చేవూరి శ్రీను కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వారికి సంతానం లేదు. సీతారావమ్మ కూలి పనులకు వెళ్తూ ఒంటరిగా జీవిస్తోంది. రోజూమాదిరిగా ఇంటి వరండాలో నిద్రించింది. సీతారావమ్మ ఇంట్లో నీళ్ల మోటర్ ఉండడంతో తెల్లవారు జామున నీళ్ల కోసం వెళ్లిన చుట్టు పక్కల మహిళలు ఆమెను నిద్ర లేపేందుకు పిలిచారు. ఎంత పిలిచినా పలకకపోవడంతో దగ్గరకు వెళ్లగా ఆమె తలపై తీవ్ర గాయమై, రక్తంతో తడిసి మంచంపై విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీçసులకు తెలియజేశారు. స్థానిక ఎస్‌ఐ డి.జయకుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నేర స్థలంలో క్లూస్ టీమ్ సభ్యులను పిలిపించి ఆధారాలను సేకరించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
బంధువులా... బయటి వాళ్ల పనా..?
ఎవరితోనూ ఎటువంటి వివాదాలు లేకుండా అందరికీ తలలో నాలుకలా ఉంటూ భర్త చనిపోయినా ధైర్యంగా ఒంటరిగా జీవనం సాగిస్తున్న సీతారావమ్మ హత్య గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కూలి పనులకు వెళ్తూ, తన పని తాను చేసుకుంటూ బతుకుతున్న సీతారావమ్మను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తలపై విపరీతంగా కొట్టి, బండలపై పడిన రక్తాన్ని మోటర్ ఆన్ చేసి నీటితో శుభ్రంగా కడిగారు. సంఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు దొరక్కుండా నేరం చేసిన వారు జాగ్రత్త పడ్డారు. ఇది బయటి వాళ్ల పనా... లేదా బంధువుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పిడుగురాళ్ల రూరల్ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment