గాడితప్పుతోంది! | Some doubts On Thief Sunil Escape Plan | Sakshi
Sakshi News home page

గాడితప్పుతోంది!

Published Fri, Mar 30 2018 12:22 PM | Last Updated on Fri, Mar 30 2018 12:22 PM

Some doubts On Thief Sunil Escape Plan - Sakshi

సరిగ్గా నాలుగైదేళ్ల క్రితం ఓ దొంగ జైలు నుంచి వాయిదాలు, అనారోగ్యం పేరుతో బయటికి వచ్చిన సందర్భంలో కొంతమంది ఎస్కార్టు పోలీసులు అతనితో కుమ్మౖక్కై మీకు సగం నాకు సగం తరహాలో వ్యవహరించిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. వాయిదాల పేరుతో ఎస్కార్టు పోలీసుల సమక్షంలో దొంగ బయటికి రావడం, ఏదో ఒక వీధిలో దొంగతనం చేయడం, తెచ్చిన సొమ్మును  పంచుకుంటున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్పట్లో కొంతమంది పోలీసులపై వేటు వేశారు.

నాలుగేళ్ల క్రితం జిల్లాకు చెందిన ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ను కేసు పనిపై రాజమండ్రికి ఎస్కార్టు పోలీసులు ఓ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లిన ఘటన అప్పట్లో దుమారం రేపింది. ప్రైవేటు వాహనంలో వెళ్లడంతోపాటు స్మగ్లర్‌ విలాసాలకు అప్పట్లో కొంతమంది ఎస్కార్టు పోలీసులు సహకరించారని తేలడంతో పోలీసులపై చర్యలు తీసుకున్నారు.

2017లో కడప కేంద్ర కారాగారం నుంచి ముగ్గురు ఖైదీలు పరారయ్యారు. అందులోనూ అంత పెద్ద ప్రహరీని దాటుకుని బయటికి వెళ్లాలంటే ఖచ్చితంగా కొంతమంది పోలీసుల సహకారం ఉందని భావించి జైళ్ల శాఖ పలువురిని సస్పెండ్‌ చేసింది.

ఈ మూడు ఘటనలే కాదు, ఒకరకమైన ఖైదీలు, రిమాండ్‌ ఖైదీలు బయటికి వెళుతున్న సందర్భంలో పోలీసుల అప్రమత్తత అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రధానంగా నిందితులు బయటి ప్రాంతాలకు (కోర్టు, వాయిదాలు, అనారోగ్య సమస్యలు) వెళుతున్న సమయంలో ఎస్కార్టుగా వెళ్లడానికి కొందరు ఉత్సాహం చూపుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. వీఐపీ నిందితులైతే ఎస్కార్టు సిబ్బందికి పండుగేనని చెప్పక తప్పదు. దీంతో నిందితులు ఎటుపోతున్నా పట్టించుకోని పరిస్థితి ఆందోళన కలిగించే పరిణామం. పైగా ఎస్కార్టు డ్యూటీలకు పలువురు పోటీలు పడుతున్నారనే ప్రచారం ఉంది.

సాక్షి, కడప : జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన గజదొంగ, పేరుమోసిన కిడ్నాపర్‌ సునీల్‌ను ఎస్కార్టు పోలీసులు తప్పించారా? లేక సునీలే పోలీసులను నమ్మకంగా బోల్తాకొట్టించి తెలివిగా తప్పించుకున్నాడా అన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని జలదుర్గం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి కర్నూలు పోలీసులు వాయిదా కోసం కోర్టుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రాయలసీమ ప్రాంతంలో కరుడుగట్టిన నేరాలతో వణుకు పుట్టించిన సునీల్‌ తప్పించుకోవడంపై అన్నీ అనుమానాలే తలెత్తుతున్నాయి. కర్నూలు నుంచి కడపకు తీసుకొచ్చిన పోలీసులు తిరిగి పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం వరకు వెళ్లడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడ సునీల్‌ వ్యక్తిగత పనులు ముగించుకుని తర్వాత పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడా? లేక ఇతర కారణాలతో పోలీసులు తప్పించారా? అన్నది అర్థం కావడం లేదు. నాలుగేళ్ల నుంచి కడప కేంద్ర కారాగారంలో సునీల్‌ రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. ఇతనిపై జిల్లాతోపాటు సీమలోని ఇతర జిల్లాల్లో కూడా కేసులు ఉన్నాయి.

రెండుసార్లు తప్పించుకున్న సునీల్‌
జిల్లాలో సునీల్‌ గ్యాంగ్‌ ఆరేళ్ల క్రితం హడలెత్తించింది. అప్పట్లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం కేంద్ర కారాగారంలో ఉన్న సునీల్‌ బెయిల్‌ కోసం విశ్వప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. సునీల్‌ అనేక నేరాల్లో కీలకపాత్ర పోషించారన్నది బహిరంగ రహస్యం. కిడ్నాప్‌లు చేయడం, బెదిరించడం, హత్యాయత్నం, హత్యల వరకు వెళ్లిన సునీల్‌ ఎలాగైనా బయటపడాలనే సంకల్పంతో జైలు నుంచే కథ నడిపినట్లుగా తెలుస్తోంది. గతంలో ఒకసారి తప్పించుకున్నప్పటికీ పోలీసులు మేల్కొక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకముందు కూడా కేంద్ర కారాగారం వద్ద నుంచి తప్పించుకుని పారిపోయారు. అతడు కృష్ణాజిల్లాలో పట్టుబడ్డాడు. ఇప్పుడు మళ్లీ తప్పించుకుని పారిపోయాడు.

అప్రమత్తమైన ‘సీమ’ పోలీసులు
పెండ్లిమర్రి మండలం నందిమండలం వద్ద గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ తప్పించుకున్న వ్యవహారం జిల్లాలో సంచలనం సృష్టించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన పోలీసులు తర్వాత అప్రమత్తమయ్యారు. సీమ జిల్లాల్లో వేట ప్రారంభించారు. అన్నిరకాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నా సునీల్‌ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. జిల్లాలో కడపతో పాటు అన్ని పట్టణాల్లోనూ, చుట్టుపక్కల జిల్లాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కూడళ్లలో నిఘా పెట్టారు. ఏదీ ఏమైనా సునీల్‌ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement