
జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రచార బోర్డు
నెల్లూరు(బారకాసు): ఆడపిల్ల లేని ఇల్లు చందమామ లేని ఆకాశం ఒకటే.. నేటి ఆడ పిల్లే రేపటి అమ్మ. ఈరోజు ఆడపిల్లను వద్దనుకుంటే రేపు సమాజం అమ్మలేని అనాథవుతుంది.ఇవి ఆడపిల్లను కాపాడుకుందామని ప్రభుత్వం ఇచ్చిన నినాదాలు. భ్రూణ హత్యలు నివారించి బాలికల నిష్పత్తిని పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు రావడం లేదు.గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరమని తెలిసినా కొందరు యథేచ్ఛగా పుట్టబోయేది ఆడ లేదా మగ అని చెప్పేస్తున్నారు. దీంతో ప్రభుత్వ నినాదాలు ఆస్పత్రుల గోడలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా జిల్లాలో బాలికల నిష్పత్తి రోజురోజుకు తగ్గిపోతోంది.
లెక్కలు చూస్తే..
2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో స్త్రీ, పురుషుల నిష్పత్తి కాస్త పెరిగినా 0–6 ఏళ్లలోపు బాలబాలికల నిష్పత్తి మాత్రం గణనీయంగా పడిపోయింది. 2001 నాటికి అప్పటి రెండు, తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో (ఏపీలో) ప్రతి వెయ్యి మంది పురుషులకు 978 మంది మహిళలున్నారు. 2011 సంవత్సరం నాటికి మహిళల సంఖ్య 936గా నమోదైంది. జిల్లా విషయానికి వస్తే 2001లో 1000 మంది పురుషులకు 984 మంది స్త్రీలున్నారు. 0–6 ఏళ్లలోపు ఉన్న ప్రతి వెయ్యి మంది బాలురకు 955 మంది బాలికలున్నారు. 2011లో స్త్రీల సంఖ్య 986కు చేరుకుంది. 2017కి 0–6 ఏళ్లలోపు వారిలో ప్రతి వెయ్యి మంది బాలురకు 945 మంది బాలికలున్నారు. ఈసంఖ్య గణ నీయంగా తగ్గింది. ప్రతి వెయ్యి మంది బాలురకు 953 మందికి పైగా బాలికలుండాలని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
పట్టించుకునే వారేరీ?
స్కానింగ్ కేంద్రాలు ఇష్టారీతిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. దీంతో భ్రూణ హత్యలకు ఆస్కారం ఇచ్చినట్లవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతి పొందిన కేంద్రాలు 209 ఉన్నాయి. మరికొన్ని కేంద్రాలు అనుమతి లేకుండానే పనిచేస్తున్నాయి. వీటిపై నిఘా పెట్టాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ ఆదిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
గతంలో పనిచేసిన డీఎంహెచ్‌ఓలు కొన్ని స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తూతూమంత్రంగా చర్యలు చేపట్టారు. ముఖ్యం గా ఉదయగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, కావలి, గూడూరు, నెల్లూరు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసుకున్న సొంత స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొన్ని ఆస్పత్రుల్లో నిషేధిత పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను వినియోగిస్తున్నట్లు సమాచారం.
కాసుల వేటలో..
అప్పటికే ఆడపిల్ల సంతానం కలిగిన వారిలో కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. మళ్లీ ఆడపిల్లని తెలిస్తే భ్రూణ హత్యలకు ఒడిగడుతున్నారు. వైద్యులు కొందరు డబ్బుల కోసం యథేచ్ఛగా అబార్షన్లు చేస్తున్నారు. దీంతో జిల్లాలో బాలిక నిష్పత్తి తగ్గిపోతోంది. చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్య శాఖాధికారులు మాముళ్ల మత్తులో మునిగి తేలుతున్నట్లు విమర్శులున్నాయి. ఎక్కడైనా ఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పందిస్తున్నారే తప్ప ఆ తర్వాత పట్టించుకోవడంలేదు.
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేసినట్లు రుజువైతే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ఘటనులు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలి. త్వరలోనే స్కానింగ్ సెంటర్లపై నిఘా పెడతాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశాం. అనుమతి లేకుండా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. నానాటికి తగ్గిపోతున్న బాలికల నిష్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాం. – డాక్టర్ వరసుందరం, డీఎంహెచ్‌ఓ, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment