ఏ తల్లి నిను కన్నదో.. | Story On Mothers Left Her Born Childrens In vizianagaram | Sakshi
Sakshi News home page

ఏ తల్లి నిను కన్నదో..

Published Tue, Jul 30 2019 8:39 AM | Last Updated on Tue, Jul 30 2019 8:39 AM

Story On Mothers Left Her Born Childrens In vizianagaram - Sakshi

ఎల్‌ఐసీ భవనం సమీపంలోని పొలంలో అట్టపెట్టెలో మగ శిశువు మృతదేహం

విజయనగరం రైల్వేస్టేషన్‌ రెండో నంబర్‌ ప్లాట్‌ఫాంపై రెండు నెలల క్రితం రెండు నెలల వయసున్న ఆడశిశువును వదిలి వెళ్లిపోయారు. రైల్వే పోలీసులు చైల్డ్‌లైన్‌ 1098 సంస్థకు సమాచారం అందించగా శిశుగృహకు తరలించారు. తాజాగా ఆదివారం విజయనగరం ఎల్‌ఐసీ భవనం సమీపంలోని పొలంలో అట్టపెట్టెలో మగ శిశువు మృతదేహాన్ని ఉంచి పడేశారు. పోలీసులు మృతదేహాన్ని కేంద్రాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. తరచూ ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఏ పాపం తెలియని పసి కూనలు చెత్త కుప్పల పాలవుతున్నారు. వీరిలో ఆడ శిశువులే అధికంగా ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది
– విజయనగరం ఫోర్ట్‌

సాక్షి, విజయనగరం :  అమ్మ ఒడిలో వెచ్చగా నిద్రపోవలసిన పసివాళ్లకు చెత్తకుండీలు పానుపులు అవుతున్నాయి. తల్లి గర్భం నుంచి బయట పడగానే నూరేళ్లు నిండిపోతున్నాయి. కళ్లు తెరవకముందే కడతేరిపోతున్న పసికందుల్ని చూసిన కళ్లు కన్నీరొలుకుతున్నాయి. కొందరు శిశువులను చెత్తకుండీలు, తుప్పల్లో పడేస్తుంటే.. మరి కొందరు ఆలయాలు, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో వదిలేస్తున్నారు. ఎవరి కంటయినా పడితే బతికి బట్టగడుతున్నారు.. లేదా కుక్కలు, నక్కలకు ఆహారమవుతున్నారు. అందరూ ఉన్నా ఎవరికేమీ కాని అనాథలవుతున్నారు. బతికి బట్ట కట్టినవారు సమాజం నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. చెత్తకుప్పల్లో పడేసిన తల్లిదండ్రులు తిరిగి రారు. మనసు మార్చుకుని వెనక్కి తీసుకెళ్లరు. అనాథ శిశువుల భవితను అంధకారం చేస్తున్నారు. 

వివాహేతర సంబంధాల వల్లే..
వివాహేతర సంబంధాల వల్ల గర్భం దాల్చినవారు శిశువుల సంగతి బయట5పడితే పరువు పోతుందని భయపడి చెత్తకుప్పలు, బావుల్లో పడేస్తున్నట్టు సమాచారం. వివాహం కాకుండా గర్భవతులు అయిన మహిళలు శిశువులను వదిలించుకోవడానికి విక్రయించడం లేదా తుప్పలు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. 

దూర ప్రాంతాల్లో వదిలేస్తున్న తల్లిదండ్రులు
కొందరు కసాయి తల్లిదండ్రులు శిశువులను దూర ప్రాంతాలకు తీసుకుని వెళ్లి ఆలయాలు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్‌ వంటి ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. ఇలా వదిలేసిన పిల్లలు ఇటీవల ఎక్కువవుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులు పిల్లలపై చీటికి మాటికి కోపం ప్రదర్శించి.. వారే ఇల్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితులు సృష్టిస్తున్నట్టు సమాచారం.

రోడ్డున పడుతున్న శిశువులు
తల్లిదండ్రులు చేసిన తప్పిదాలకు శిశువులు బలి అవుతున్నారు. అభం, శుభం తెలియని శిశువులు చెత్తకుప్పల పాలవుతున్నారు. మరికొందమంది  మృత్యువాత పడుతున్నారు. అపురూపంగా పిల్లలను పెంచాల్సిన తల్లిదండ్రులు నరరూప రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. 

శిశుగృహకు అప్పగించండి
పిల్లలు అవసరం లేదునుకునే వారు శిశుగృహకు అప్పగించాలి. అప్పగించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. అన్ని రకాల వసతి రక్షణ కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాం. శిశువులను చెత్తకుప్పల పాల్జేయడం మంచిది కాదు.
– ఎం.అరసివిల్లినాయుడు, మేనేజర్, శిశు గృహ

1098కి కాల్‌ చేయండి
పిల్లలు అక్కర్లేకపోతే చైల్డ్‌లైన్‌ ట్రోల్‌ ఫ్రీ నంబరు1098కు ఫోన్‌ చేసి ఫలానా ప్రాంతంలో శిశువు ఉన్నాడని సమాచారం ఇస్తే చాలు.. క్షణాల్లో శిశువుకు రక్షణ కల్పిస్తాం. నేరుగా తెలియజేయినా పర్వాలేదు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆర్థిక ఇబ్బందులుంటే ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను వినియోగించుకోవాలి తప్ప.. పిల్లలను చంపేయడం దుర్మార్గం.– జి.కె.దుర్గ, చైల్డ్‌లైన్‌ 1098 కౌన్సిలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement