
నెల్లూరు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థిని
నెల్లూరు, ఆత్మకూరు: కళాశాలలో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని బీఎస్సార్ జూనియర్ కాలేజీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన మైనంపాటి వెంకటేశ్వర్లు కుమార్తె మాధురి బీఎస్సార్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. రెండురోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హాస్టల్ పైన ఉన్న అంతస్తు వద్ద సిమెంట్ పిల్లర్‌కు మాధురి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థినులు గుర్తించి కాలేజీ యాజమాన్యానికి చెప్పారు. వారు ఆమెను పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం మాధురి వెంటిలేటర్‌పై ఉందని, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్పీ పరిశీలన
విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ ఎం.రామాంజనేయులురెడ్డి, సీఐ ఎండీ అల్తాఫ్‌హుస్సేన్, ఎస్సై పి.నరేష్‌లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వారు విద్యార్థినితోపాటు నెల్లూరులో ఉండడంతో పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నామని తెలిపారు. కాగా ట్రైనీ ఎస్సై అరుణాదేవి ద్వారా సహ విద్యార్థినులను విచారణ చేసినట్లు ఎస్సై చెప్పుకొచ్చారు. ఇంట్లో సమస్యల కారణంగా మాధురి ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు. కాగా బంధువులు మాత్రం ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని, కాలేజీలో ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో మాధురి తల్లిదండ్రులు నెల్లూరుకు వెళ్లి కుమార్తెను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థి సంఘాలు మాత్రం కాలేజీ తీరు కారణంగా ఇలా జరిగిందని ఆరోపిస్తున్నాయి. విద్యార్థిని రాసిన లెటర్‌ను మాయం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్‌ఐఓ స్పందించాలి
నెల్లూరు(టౌన్): మాధురి ఆత్మహత్యాయత్నంపై ఆర్‌ఐఓ వెంటనే స్పందించాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా కౌషిక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నెల్లూరులో విద్యార్థిని చికిత్స పొందున్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్లకు అనుమతులు లేకున్నా ఆర్‌ఐఓ మిన్నకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే హాస్టళ్లను తనిఖీ చేసి అనుమతి లేనివాటిని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సుధీర్, రాజశేఖర్, తరుణ్, గిరి, ప్రకాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment