సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి చెందిన కంపెనీలకు ట్యాక్స్ కన్సల్టెంట్ ఎన్.ఎస్.అయ్యంగార్‌ను అరెస్ట్ చేసినట్లు జీఎస్‌టీ అధికారులు శనివారం హైకోర్టుకు నివేదించారు. తన భర్త అయ్యంగార్‌ను జీఎస్‌టీ అధికారులు తీసుకెళ్లారని, అయితే, ఆయన ఆచూకీ తెలియడం లేదని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఎన్.విజయలక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, సీజీఎస్‌టీ అధికారి శ్రీనివాస్ గాంధీ, డిప్యూటీ కమిషనర్ సుధారాణిలు ఈ నెల 2న ఉదయం 7.30 గంటల సమయంలో అయ్యంగార్ ఇంటికి వచ్చి, ఆయనను వారివెంట తీసుకెళ్లారని చెప్పారు. మధ్యాహ్నంకల్లా పంపిస్తామని చెప్పారని, అయితే ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియడం లేదని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ భర్తను జీఎస్‌టీ అధికారులు అక్రమంగా నిర్బంధించారని వాదించగా జీఎస్‌టీ తరఫు న్యాయవాది బి.నర్సింహశర్మ తోసిపుచ్చారు.
అయ్యంగార్‌ను అక్రమంగా నిర్బంధించలేదని తెలిపారు. విచారణ నిమిత్తం తీసుకొచ్చామని, విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. సుజనా గ్రూపు కంపెనీల జీఎస్‌టీ ఎగవేతలో అయ్యంగార్ పాత్ర ఉన్నట్లు తేలిందని, అందుకే అతన్ని అరెస్ట్ చేశామమన్నారు. ఆయనను కోర్టు రిమాండ్‌కు పంపిందని వివరించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషనర్ భర్తను అరెస్ట్ చేసినప్పుడు, ఇక ఈ వ్యా జ్యంలో విచారించేందుకు ఏమీలేదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
సుజనా గ్రూపు ట్యాక్స్ కన్సల్టెంట్‌ను అరెస్ట్ చేశాం
Published Sun, May 5 2019 1:59 AM | Last Updated on Sun, May 5 2019 1:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment