అనంతపురం సెంట్రల్ : వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. అందరూ పిల్లాపాపలతో సరదాగా గడిపేందుకు సొంతూళ్లకు, పర్యటక ప్రాంతాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. వారం, పది, పదహైదు రోజులు గడపాలని ఆశ పడతారు. అలా వెళ్తున్న వారు జరభద్రంగా ఉండాలి. దొంగతనాలకు అనువైన సమయంగా నేరస్తులు వేసవి కాలన్ని ఎంచుకుంటారు. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే కన్నం వేసే ప్రమాదం ఉంది. మీ ఇంటిని సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఏటా దాదాపు రూ.8 కోట్ల వరకు ప్రజల ఆస్తులు దొంగల వశం అవుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం వేసవి సెలవుల్లో జరుగుతున్నవే అధికం. దీనికి తోడు తాళం వేసిన ఇళ్లల్లోనే 90 శాతం దొంగతనాలు జరుగుతుండడం గమనార్హం. కావున తాళం వేసి ఊళ్ళకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు అవసరం.
సెలవుల్లో ఊరెళ్లేటప్పుడు...
పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయి. పిల్లలు ఎంజాయ్ చేసేందుకు వారి అమ్మమ్మ, నానమ్మ, బంధువుల ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు తల్లిదండ్రుల వద్ద మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వేసవి సెలవులు వస్తే పిల్లలను తీసుకొని అలా బయటకు పోదామని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వీలున్నంత వరకు ఇంటి వద్ద ఒక మనిషి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. లేరన్న సమయంలో నమ్మకస్తులకు ఇంటి బాధ్యత అప్పగించాలి. ఎందుకంటే మనిషి ఇంట్లో ఉన్నట్లైతే సామాన్యంగా దొంగలు ప్రవేశించే అవకాశముండదు. లేనిపక్షంలో తాళం వేసినట్లు దొంగలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో నిరంతరం లైట్లు, టీవీ ఆన్‌లో ఉంచడం తదితర చిట్కాలు పాటించాలి. కాపలాగా కుక్కలను ఉంచుకోవడం కూడా ఉపయోగకరం.
అజాగ్రత్త ప్రయాణం ప్రమాదకరం
ఎక్కువశాతం మంది బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేస్తారు. ప్రయణాల్లో కూడా దొంగతనాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంది. ప్రయాణికుల మాదిరిగా బస్సుల్లో ఎక్కి బ్యాగులు మార్పిడి చేసి దిగిపోయే దొంగలు ఎక్కువ మంది ఉన్నారు. బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ఆదమరిచి నిద్రపోయే సమయంలో చైన్‌స్నాచింగ్, పర్సు చోరీలు జరిగే అవకాశం ఉంది.
ఉచిత సర్వీసును సద్వినియోగం చేసుకోండి
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) పూర్తిగా ఉచితం. చిన్న సమాచారం ఇస్తే చాలు ఎన్నిరోజులైనా వచ్చేంత వరకు ఆ ఇంటికి భద్రత కల్పిస్తాం. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అపోహలు వీడి ఈ రోజే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఊరెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలి. ఎంతమంది ఇళ్లకైనా సీసీ కెమెరాలు అమర్చేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇటీవల జరుగుతున్న దొంగతనాల్లో ఎక్కువశాతం తాళం వేసి ఊళ్లకు వెళ్లిన వారు, ఇంటిపైన పడుకున్న వారి ఇళ్లలో మాత్రమే దొంగతనాలు జరిగాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేరాలు జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. – శ్రీనివాసులు, సీసీఎస్ డీఎస్పీ
లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టంతో దొంగతనాలకు చెక్
పోలీసు శాఖ అమలు చేస్తున్న లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్) యాప్‌తో దొంగతనాలకు అడ్డుకట్ట వేసే అవకాశముంది. మీ ఇంటికి తాళం వేసి వెళ్తున్నట్లయితే, మీరు ఊరు వెళ్లి వచ్చే వరకు సీసీ కెమెరాల టెక్నాలజీ పర్యవేక్షణతో ఇంటిపై నిఘా ఉంచుతారు.
♦ ‘ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్’ యాప్‌లోకి వెళ్లి మీ వివరాలు, చిరునామా సెల్ నంబర్ వివరాలతో దరఖాస్తును భర్తీ చేస్తే ఆమోదిస్తూ రిజిస్ట్రేషన్ యూనిక్ ఐడీ ఇస్తారు.
♦ ఎప్పుడైనా ఇంటికి తాళం వేసి వెళ్తున్నట్లయితే యాప్‌లోని రిక్వెస్ట్ వాచ్‌లో ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు ఇంటికి తాళం వేసి వెళ్లున్నట్లు వివరాలు పేర్కొనాలి.
♦ ఫలానా రోజున ఇంట్లో ఉండటం లేదని పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
♦ అప్పుడు మీ ఇంటికి వచ్చి వైర్లెస్ మోషన్ కెమెరా (కెమెరా ముందు కదలికలు కనిపిస్తే రికార్డు చేసే కెమెరా)ను మోడమ్ (వైఫై)ను ఏర్పాటు చేస్తారు.
♦ అప్పటి నుంచి మీ ఇల్లు నిఘాలో ఉంటుంది. కెమెరాను పోలీసు కంట్రోల్ రూమ్, ఇంటి యజమాని మొబైల్‌కు అనుసంధానిస్తారు.
♦ కెమెరా ముందు ఏమైనా కదలికలు జరిగితే వెంటనే ఫొటోలు, వీడియోను రికార్డు చేసి కంట్రల్‌రూమ్‌కు పంపే సౌకర్యం ఉంటుంది. అలాగే కంట్రోల్ రూమ్‌లో సైరన్ మోగడం ద్వారా నిమిషాల్లో సదరు ఇంటికి పోలీసులు చేరుకుని దొంగలను పట్టుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment