ముంబై: ‘ఏం పెట్టి పోషిస్తావురా?’ అని ప్రశ్నించడానికి అతనేమీ ఆవారా కాదు. బిజినెస్ బాగా నడిచే ఓ గార్మెట్ షాప్ ఓనర్. ఎగువ మధ్యతరగతి కుటుంబం, కారు, మంచి ఇల్లు!! ‘ఏం చూసి ప్రేమించావు?’ అని వెలెత్తిచూపడానికి కూడా అవకాశంలేని వ్యక్తిత్వం ఆమెది. ఉద్యోగం చేస్తూ ఇంటికి ఆసరగా నిలబడింది. స్వతంత్రభావనలు మెండుగా నింపుకొన్న నేటి యువతరానికి ప్రతీకలైన ఈ ఇద్దరూ ‘మతం’ అనే జాఢ్యానికి బలైపోయారు. మతాంతర వివాహం చేసుకుకోవాలనుకున్న ఈ జంట.. ఇరు కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో విషంతాగి ప్రాణాలు విడిచారు. ముంబైలోని ములుంద్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలివి..
నాలుగేళ్ల ప్రేమ..: నవీ ముంబైలోని దిఘా ప్రాంతానికి చెందిన మనీషా నారాయణ్ నెగి(21) డిగ్రీ పూర్తిచేసి, ఓ షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం చేసేది. ములుంద్‌లోని ఇస్లామ్‌పూరకు చెందిన సల్మాన్ అఫ్రోజ్ ఖాన్(26) స్థానికంగా ఓ గార్మెట్ షాప్ నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట ఏర్పడిన వీరి పరిచయం కాలక్రమంలో ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ మతాలు వేరువేరన్న కారణంగా ఇంట్లోవాళ్లు వ్యతిరేకించారు. నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో మనీషా-సల్మాన్‌ను ఒక నిర్ణయానికి వచ్చారు.
కారు ఇంజన్ ఆన్‌లో ఉంచి..: ములుంద్‌లోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో అనుమానిత కారు గురించి బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. ఇంజిన్ ఆన్‌లోనే ఉన్నా, లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో పోలీసులు కారు అద్దాలను పగులగొట్టి డోర్ తీశారు. డ్రైవింగ్ సీట్‌లో సల్మాన్, అతని పక్కనే మనీషా సృహతప్పి పడిఉన్నారు..ఇద్దరి నోటి వెంటా తెల్లటి నేరగ! వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సల్మాన్‌దిగా భావిస్తోన్న నీలిరంగు లాన్సర్ కారు నుంచి ఒక షోడా బాటిల్‌ను, విషం డబ్బాను, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నాలుగు రోజులుగా కారులోనే: మతాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో నాలుగు రోజుల కిందట ఇంటినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఇంట్లో వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతూ.. తాము పెళ్లిచేసుకోబోతున్నట్లు చెప్పారు. ఈ నాలుగు రోజులూ మనీషా-సల్మాన్‌లు కారులోనే గడిపినా.. ఉద్యోగాలకు క్రమం తప్పకుండా వెళ్లేవారని, రంజాన్ ఉపవాసాలుంటున్న సల్మాన్ ఇఫ్తార్ కోసం మాత్రమే అరగంట ఇంటికి వెళ్లొచ్చేవాడని పోలీసులు చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామని, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి పంపామని ములుంద్ స్టేషన్ అధికారులు తెలిపారు. కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సల్మాన్ తండ్రి అంగీకరించగా, మనీషా కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment