ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ చిరంజీవి పడాల్
అవినీతిని అక్రమాలను గిరిజనులు మౌనంగా భరిస్తారు. పై అధికారులకు ఫిర్యాదు చేయాలనుకోరు. మన్యవాసుల్లో అమాయకత్వం, అవగాహనారాహిత్యమే అందుకు కారణం. అదే లంచగొండి అధికారులకు వరమవుతోంది. ఇన్నాళ్లకు ఓ బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏజెన్సీలో తొలిసారి రెవెన్యూ అధికారి పట్టుబడ్డారు.
గూడెంకొత్తవీధి/చింతపల్లి (పాడేరు):తన డ్రైవర్ ద్వారా రూ.50 వేలు లంచం తీసుకుంటూ జీకేవీధి తహసీల్దార్ చిరంజీవి పడాల్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడడం ఏజెన్సీలో కలకలం సృష్టించింది. పాడేరు ప్రాంతానికి చెందిన తమర్భ చిరంజీవి పడాల్ 2015లో గూడెంకొత్తవీధి మండలం తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అతనిపై అనేక ఆరోపణలున్నాయి. ముఖ్యంగా అక్రమ మైనింగ్ క్వారీలకు అనుమతులు మంజూరు చేయడంలో సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలున్నాయి. కుటుంబ సభ్యుల పేర్లతో జీకేవీధి, చింతపల్లి మండలాల్లో లేటరైట్ తవ్వకాలకు బినామీలకు అనుమతులు మంజూరు చేసి రూ.లక్షల అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జీకేవీధి మండలంలోని దారకొండ ప్రాంతంలో గంజాయి సాగుకు ప్రోత్సహిస్తున్న ముఠాలతో ఇతడికి లాలూచీ ఉందనే విమర్శలు వినిపించాయి. మధ్యలో ఎస్.రాయవరం మండలానికి బదిలీ అయినా 6 నెలలు తిరక్కముందే పడాల్ మళ్లీ జీకేవీధి మండలానికి బదిలీ చేయించుకున్నారు.
మాజీ సర్పంచ్ ఫిర్యాదుతో..
గూడెంకొత్తవీధి మండలంలోని ఏబులం ప్రాంతంలో 4 ఎకరాల్లో నల్లరాయి క్వారీ నిర్వహించేందుకు డౌనూరుకు చెందిన మాజీ సర్పంచ్ రామకృష్ణరాజు అనకాపల్లి గనులశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక తహసీల్దార్ వద్ద ఎన్‌ఓసీ తీసుకురావాలని సూచించడంతో ఈనెల 19న రామకృష్ణరాజు తహసీల్దార్ చిరంజీవిని కలిశారు. అనుమతుల మంజూరుకు రూ.15 లక్షలు డిమాండ్ చేయగా, రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం రూ. లక్ష అడ్వాన్సుగా ఇచ్చేందుకు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరింది. రామకృష్ణరాజు విశాఖపట్నం ìఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్నారు. బుధవారం మధ్యాహ్నం రామకృష్ణరాజు రూ.50 వేల నగదు తీసుకుని తహసీల్దార్ చిరంజీవి పడాల్ వద్దకు వెళ్లగా తన వద్ద పనిచేస్తున్న ప్రైవేటు జీపు డ్రైవర్ గణేష్‌కు ఇమ్మని సూచించారు. కార్యాలయంలోనే ఉన్న గణేష్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గురువారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. గిరిజన ప్రాంతంలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోతున్నా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి అక్రమార్కులను పట్టించిన దాఖలాలు లేవు. తొలిసారిగా గిరిజనుడైన అధికారిపైనే ఫిర్యాదు చేసి ఏసీబీ అధికారులకు పట్టించడంతో మన్యంలోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment