తహసీల్దార్‌ కారు డ్రైవర్‌ మృతి | Tahsildar Vijaya Reddy Driver Gurunath Died | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ కారు డ్రైవర్‌ మృతి

Published Wed, Nov 6 2019 3:04 AM | Last Updated on Wed, Nov 6 2019 7:41 AM

Tahsildar Vijaya Reddy Driver Gurunath Died - Sakshi

పెద్ద అంబర్‌పేట: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై సురేష్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించిన తర్వాత ఆమెను కాపాడే యత్నంలో మంటలంటుకొని తీవ్రంగా గాయపడిన ఆమె కారు డ్రైవర్‌ గురునాథం (27) చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయారెడ్డిపై నిందితుడు సురేష్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ఘట నా స్థలంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో ఆమె కారు డ్రైవర్‌ గురునాథానికి మంటలంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను డీఆర్‌డీఎల్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెం దినట్లు పోలీసులు తెలిపారు. గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. విజయారెడ్డి వద్ద నాలుగేళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురునాథంకు భార్య, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య ఎనిమిది నెలల గర్భిణి. గురునాథం మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన  అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

నిందితుడు సురేష్‌ అరోగ్య పరిస్థితి విషమం
తహశీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి సజీవదహనం చేసిన నిందితుడు సురేష్‌కు ఉస్మానియా ఆస్పత్రిలోని ప్లాస్టీక్‌ సర్జరీ విభాగంలో పోలీసుల సంరక్షణలో చికిత్స కొనసాగుతోంది. కాగా 65 శాతం కాలడంతో సురేష్‌ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు చూడడానికి బంధువులుగానీ, స్నేహితులుగానీ ఎవ్వరూ రాలేదని ఆçస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

చికిత్స పొందుతున్న మరో ఇద్దరు... 
తహసీల్దార్‌కు నిప్పంటించిన ఘటనలో గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలోనే అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రయ్యకు కూడా గాయపడటంతో డీఆర్‌డీఎల్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి శరీరం 50 శాతం మేర కాలినట్లు పోలీసులు తెలిపారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. అదేవిధంగా తన భూ సమస్య పరిష్కారం కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన కవాడిపల్లికి చెందిన బొడిగె నారాయణగౌడ్‌కు కూడా గాయాలైన విషయం తెలిసిందే. అయితే ఆయనను హయత్‌నగర్‌లోని టైటాన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. 

ఉద్యోగం కల్పించండి: సౌందర్య
విధి నిర్వహణలో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్ధార్‌ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన డ్రైవర్‌ గురునాథం భార్య సౌందర్య తనకు ఉద్యోగం కల్పించాలని కోరారు. తన, పిల్లల భవిష్యత్‌ కోసం ఉద్యోగం కల్పించి, దళితులకు కేటాయించిన 3 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement