సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి చెందాడు. విజయారెడ్డిపై దాడి సమయంలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈసీజీలో పల్స్ రేటు ఫ్లాట్‌గా రావడంతో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్ తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై రైతు సురేశ్ సోమవారం పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విజయారెడ్డి తన కార్యాలయంలోనే మృతి చెందారు. ఇక ఆమెతో పాటు నిందితుడు సురేశ్‌కు కూడా నిప్పంటుకోవడంతో 65 శాతం గాయాల పాలైన అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు.
కాగా వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు వెళ్లిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడు సురేశ్ కాల్‌డేటా, విజయారెడ్డి కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సురేశ్ మాట్లాడినట్లు తేలడంతో.. ఈ కేసులో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. (చదవండి: అదే ఆమె హత్యకు కారణమైంది..)
Comments
Please login to add a commentAdd a comment