సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి, రైతు నారాయణ ప్రస్తుతం హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివాదాస్పద భూమి పట్టా విషయమై సురేశ్ అనే రైతు విజయారెడ్డిని ఆమె కార్యాలయంలో సజీవదహనం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో అక్కడే ఉన్న నారాయణ అనే రైతుకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన తన ఇద్దరు కుమారులతో ఘటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘ నేను ఎమ్మార్వోతో మాట్లాడుతుండగానే ముగ్గురు వ్యక్తులు గదిలోకి వచ్చారు. దీంతో నన్ను కాసేపు బయట ఉండమని ఎమ్మార్వో చెప్పడంతో నేను గది ముందే వేచి చూస్తున్నాను. కొద్ది సేపటికే ఎమ్మార్వో విజయ మంటలతో బయటకు పరుగులు పెట్టారు. తలుపు దగ్గరే ఉన్న నాకు తీవ్ర గాయాలయ్యాయి అని నారాయణ పేర్కొన్నాడు.
కాగా విజయారెడ్డి హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి నారాయణ నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలం సేకరించారు. ఈ నేపథ్యంలో నారాయణ చెబుతున్న ప్రకారం సురేశ్‌తో పాటు మరో ఇద్దరు కూడా కార్యాలయానికి వచ్చారన్న విషయం స్పష్టమైంది. పోలీసులు ఈ కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా నాగోల్‌లోని శ్మశాన వాటికలో విజయారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment