సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్ట్‌మార్టం పూర్తి చేసిన ఉస్మానియా వైద్యులు సురేష్ మృత దేహాన్ని ఆయన స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడు సురేష్ మృతిపై ఆయన తండ్రి కృష్ణ స్పందించారు. తన కొడుకు తహసీల్దార్ కార్యాలయానికి ఎప్పుడూ వెళ్ళలేదని, తహశీల్దార్‌ను ఎందుకు హత్య చేశాడో తమకు తెలీదని అన్నారు. తమకు చెందిన తొమ్మిది గుంటల భూమిని ఏడాది క్రితం మల్‌రెడ్డి రంగారెడ్డికి అమ్మినట్లు ఆయన తెలిపారు. మొత్తం ఏడు ఎకరాలు భూమి తమ అన్నదమ్ములకు చెందినది ఉందని, అయితే భూ సమస్య నిమిత్తం తానే తహశీల్దార్ ఆఫీసు, కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు కృష్ణ తెలిపారు. తమ కుమారుడు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఈరోజు రాత్రి అంత్యక్రియలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
కాగా విజయారెడ్డిపై దాడి సమయంలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈసీజీలో పల్స్ రేటు ఫ్లాట్‌గా రావడంతో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్ తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు వెళ్లిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.
తహశీల్దార్‌ను ఎందుకు హత్య చేశాడో తెలీదు
Published Thu, Nov 7 2019 7:28 PM | Last Updated on Thu, Nov 7 2019 8:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment