పోలీసుల అదుపులో గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ,స్వాధీనం చేసుకున్న నగదు
అమీర్‌పేట, రామ్‌గోపాల్‌పేట: ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండటం, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రజాకూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ ప్రలోభాల పర్వానికి తెరలేపింది. స్థానిక నేతల అనుచరులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి అనుమాయులూ రంగంలోకి దిగారు. ఆదివారం అర్ధరాత్రి ఓ టీడీపీ అభ్యర్థికి చెందినవిగా అనుమానిస్తున్న రూ.70 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఏపీ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు నలుగురిని అమీర్‌పేట ప్రాంతంలో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఈ నగదు వినియోగిస్తున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారులో తరలిస్తున్న రూ.70 లక్షల నగదును వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, రాంగోపాల్‌పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి భవ్య సిమెంట్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న శివకుమార్ తన కారులో సింధీకాలనీ నుంచి శేరిలింగంపల్లికి రూ.70లక్షల నగదు తీసుకుని వెళుతుండగా విశ్వసనీయ సమాచారంతో టాస్క్‌ఫోర్స్, రాంగోపాల్‌పేట్ ఇన్‌స్పెక్టర్లు గట్టు మల్లు, బాబు సిబ్బందితో కలిసి సింధీకాలనీలో కారును అడ్డుకుని సోదా చేయగా చేయగా నగదు లభ్యమైంది. ఆ నగదుకు సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తన యజమాని సూచన మేరకు సింధీకాలనీలోని డబ్బును శేరిలింగంపల్లికి తరలిస్తున్నట్లు శివకుమార్ పోలీసు విచారణలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని కోర్టు ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు ఇన్‌స్పెక్టర్ బాబు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పట్టివేత
సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఏపీ నుంచి వచ్చి అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో తిష్టవేసిన నలుగురు వ్యక్తులను సోమవారం తెల్లవారుజామున ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.4.63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అమీర్‌పేట సిల్వర్ పార్క్ లాడ్జిలో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు తిష్టవేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం అర్ధరాత్రి హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. అదే సమయంలో టీడీపీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. దీనిపై సమాచారం అందడంతో ఎస్సార్‌నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గోషామాల్ ఏసీపీతో పాటు ఎన్నికల స్పెషల్ టీం తనిఖీ చేపట్టగా ఇన్నోవా వాహనంలో రూ.2 లక్షలు, లాడ్జి గదుల్లో నుంచి రూ.2.63 లక్షల నగదు లభించింది. లాడ్జిలో మకాం వేసిన గుంటూరు వాసి సాంబశివరావు, తెనాలికి చెందిన అనంతకుమార్, వెంకటేశ్వర్‌రావు, ఎండీ సలీంలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు గుంటూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులైన వీరు సనత్‌నగర్ టీడీపీ అభ్యర్థి తరఫున డబ్బు పంపిణీ చేసేందుకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో సనత్ నగర్ టీడీపీ అభ్యర్థి కూన వెంకటేష్‌గౌడ్... గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఉన్న వాయిస్ రికార్డులో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో వీటినీ పరిగణలోకి తీసుకున్న పోలీసుల న్యాయ సలహా అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
దర్యాప్తులో అనిల్‌కుమార్ కేసు...
టీడీపీ నేత వల్లభనేని అనిల్‌కుమార్ కేసు ఇప్పటికే దర్యాప్తులో ఉంది. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు హుండీ మార్గంలో పంపుతున్న రూ.60 లక్షలకు సంబంధించి అక్టోబర్ మూడో వారంలో ఇది నమోదైంది. ఈ నగదును తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్, జూనియర్ ఆర్టిస్ట్స్ యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్, అతడి స్నేహితుడు సైఫాబాద్‌కు చెందిన వర్మ సమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన వాహనంలోనే, సొంత డ్రైవర్ తరలించారని తేల్చారు. ఈ కేసు ఇప్పటికే దర్యాప్తులో ఉన్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment