సాక్షి, చిత్తూరు : విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే గాడి తప్పుతున్నారు.. విచక్షణ కోల్పోయి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆలస్యంగా వచ్చారనే కోపంతో విద్యార్థుల బట్టలు ఊడదీయించి నగ్నంగా ఎండలో నిలబెట్టారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. పూంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన నాలుగో తరగతి విద్యార్థులు ఐదుగురు ఉదయం పాఠశాలకు 8:40కు రావాల్సి ఉండగా వారు 8:55కి వచ్చారు. సెకండ్ బెల్ అయిన తర్వాత స్కూలుకు వచ్చారని మొదట వారిని బయట ఎండలో నిలబెట్టారు.
ఆ తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అర్థనగ్నంగా, ఐదు నిమిషాలకంటే ఎక్కువ ఆలస్యంగా వచ్చిన వారిని నగ్నంగా నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావటంతో విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జిల్లా విద్యాశాఖాధికారి సైతం మండల విద్యాశాఖాధికారిని అక్కడికి పంపించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత స్కూలు యాజమాన్యంపై తగుచర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఆయా తప్పిదం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని యాజమాన్యం చెప్పటం గమనార్హం. కాగా ఉపాధ్యాయుల తీరుపై బాలల హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment