కాన్పూర్: అత్యాచార ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్షను విధించేలా కేంద్రం పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టానికి సవరణలు చేసి వారమైనా కాకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ తన తల్లిదండ్రులు, సోదరి ఎదుటే బాలిక(13)పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ దెహాత్ జిల్లాలో ఆదివారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివలీ ప్రాంతంలో నివాసముండే 16 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులు, సోదరి మద్ధతుతో ఆదివారం 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిని తీవ్రంగా హింసించాడనీ.. లైంగిక దాడి గురించి బయటపెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారని దెహాత్ జిల్లా డీఐజీ రతన్‌కాంత్ పాండే తెలిపారు. ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని ముందుగా జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అక్కడ నుంచి లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివలీ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి తల్లిదండ్రులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మైనర్, అతని తల్లిదండ్రులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేస్తామని డీఐజీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment