‘డీఎన్‌ఏ’నా మజాకా! | girl Accused gets life imprisonment | Sakshi
Sakshi News home page

‘డీఎన్‌ఏ’నా మజాకా!

Published Thu, Apr 25 2024 6:29 PM | Last Updated on Thu, Apr 25 2024 6:29 PM

girl Accused gets life imprisonment - Sakshi

లంగర్‌హౌస్‌ పరిధిలో రెండేళ్ల క్రితం ఘటన  

కోర్టులో సాక్ష్యం చెప్పనీయని బాధితురాలి తల్లి  

దోషికి జీవిత ఖైదు విధించిన పోక్సో కోర్టు  

సాక్షి, హైదరాబాద్: ‘సాక్షులు ఎదురు తిరగవచ్చు.. కానీ ఆధారాలు మాత్రం ఎప్పటికీ నిజమే చెబుతాయి’ నేర దర్యాప్తులో కీలకమైన ఈ ప్రాథమికాంశం మరోసారి నిరూపితమైంది. లంగర్‌హౌస్‌ పరిధిలో సోదరిపై అత్యాచారం చేసిన కామాంధుడికి పోక్సో న్యాయస్థానం మంగళవారం జీవితఖైదు విధించిన విషయం విదితమే. ఇందులో బాలిక తల్లి సాక్ష్యం చెప్పకున్నా... తమ కుమార్తెను చెప్పనీయకున్నా... డీఎన్‌ఏ నివేదికలు మాత్రం నేరం నిరూపించాయి. వీటితో పాటు డాక్టర్‌ వాంగ్మూలం ఆధారంగా పోక్సో న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తులో కీలక భూమిక పోషించిన అప్పటి ఆసిఫ్‌నగర్, ప్రస్తుత సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిని కొత్వాల్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితో పాటు మహిళా భద్రత విభాగం అదనపు డీజీ షికా గోయల్‌ అభినందించారు.  
 
దారుణానికి ఒడిగట్టిన సోదరుడు.. 
లంగర్‌హౌస్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నలుగురు సంతానం. చిన్న కుమార్తె కొన్ని నెలల వయసులో ఉండగానే భర్తకు దూరమైంది. ఈమె కుమారుడు బైక్‌ మెకానిక్‌. ఏడో తరగతి చదువుతున్న సోదరిపై ఇతని కన్నుపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దాదాపు ఏడాది పాటు ఈ దారుణం కొనసాగించాడు. 2021 మే 20న బాలికలో వస్తున్న మార్పులు గమనించిన ఆమె తల్లి లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌కు తీసుకువెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె ఆరు నెలల గర్భిణి అని తేల్చారు. దీంతో బాలికను తీసుకుని నిలోఫర్‌ ఆస్పత్రికి వెళ్లిన ఆమె తల్లి అబార్షన్‌ చేయాల్సిందిగా కోరింది. కోర్టు ఉత్తర్వులు లేనిదే ఆ పని చేయలేమని వైద్యులు చెప్పడంతో బాధితురాలి తల్లి లంగర్‌హౌస్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది.  

దర్యాప్తు చేసిన నాటి ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ.. 
పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసును అప్పటి ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతి నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జ్‌ట్‌ దాఖలు చేశారు. దీనికి ముందే బాలిక–ఆమె సోదరుడి నుంచి సేకరించిన నమూనాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించి, సారూప్యంగా వచ్చిన ఆ నివేదికను అభియోగపత్రాలకు జత చేశారు. ఈ కేసు పోక్సో కోర్టులో విచారణలో ఉండగా సాక్షిగా హాజరైన బాధితురాలి తల్లి ఎదురు తిరిగింది. పోలీసులకు వ్యతిరకంగా సాక్ష్యం చెప్పింది. కేసు విచారణలో ఉండగానే బాలిక తల్లి తన కుమారుడికి (నిందితుడు) వివాహం చేసింది. పోలీసుల సమన్లు అందుకోకుండా చాలా రోజులు బాలిక వారికి కనిపించకుండా దూరంగా ఉంచింది.  

ఆ రెండింటి ఆధారంగానే జీవిత ఖైదు... 
ఘోరం చోటు చేసుకున్న నాటి నుంచి దాదాపు ఏడాది పాటు భరోసా కేంద్రం అధికారులు బాలిక ఆలనాపాలనా చూసుకున్నారు. డీసీపీ డి.కవిత ఈ కేసును క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఆమె తల్లి మాత్రం తన కుమారుడిని రక్షించడం కోసం బాలిక సాక్ష్యం చెప్పకుండా ప్రయతి్నంచింది. ఎట్టకేలకు బాలిక ఆచూకీ కనిపెట్టిన అధికారులు సమన్లు ఇవ్వడంతో ఆమె తల్లి పోక్సో కోర్టుకు తీసుకువచి్చంది. పోలీసుల అభియోగాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించింది. అయినప్పటికీ పోలీసులతో పాటు భరోసా కేంద్రం అధికారులు సైతం ఈ కేసు విచారణను కొనసాగించారు. బాలిక– ఆమె సోదరుడి నమూనాలకు సంబంధించిన డీఎన్‌ఏ రిపోర్టులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్‌తో వాంగ్మూలం ఇప్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement