
హుండీలో సొమ్మును తస్కరించిన వ్యక్తిని విచారిస్తున్న ఎస్సై వీర్రాజు
పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల : చిన వెంకన్న ఆలయ హుండీలో చేయిపెట్టి సొమ్మును తస్కరించిన వ్యక్తి మరోసారి చోరీ చేసేందుకు శుక్రవారం క్షేత్రానికి వచ్చి దేవస్థానం సిబ్బంది చేతికి చిక్కాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో 10 రోజుల క్రితం శ్రీవారి ఆలయానికి వచ్చి ఓ వ్యక్తి దర్శనానంతరం బయటకు వెళ్లే క్రమంలో ముఖ మండపంలో ఉన్న పెద్ద హుండీలో చేయిపెట్టి నగదును తస్కరించాడు. దీన్ని సీసీ పుటేజీలో పరిశీలించిన ఆలయ అధికారులు, సిబ్బంది అతడ్ని పట్టుకునే లోపే అక్కడి నుంచి జారుకున్నాడు. ఆలయ అధికారులు ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం మళ్లీ అతను ఆలయానికి వచ్చాడు.
హుండీలో చేయి పెడుతుండగా ఆలయ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. తీరా చూస్తే 10 రోజుల క్రితం హుండీలో చేయిపెట్టి సీసీ పుటేజీలో రికార్డయింది ఇతడేనని సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడ్ని పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎస్సై వీర్రాజు విచారణ చేపట్టారు. అతడు చింతలపూడిలోని ఆంథోనినగర్‌కు చెందిన దుద్దు పవన్‌కుమార్‌గా గుర్తించారు. అతను పాత నేరస్తుడని ఎస్సై చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.