‘ఫేస్‌బుక్‌’ ఫొటో పట్టించింది | Thief Caught By Facebook Photo Nellore | Sakshi
Sakshi News home page

‘ఫేస్‌బుక్‌’ ఫొటో పట్టించింది

Published Tue, Jun 18 2019 8:37 AM | Last Updated on Tue, Jun 18 2019 9:10 AM

Thief Caught By Facebook Photo Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : వృద్ధ దంపతులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టగా ఫేస్‌బుక్‌లో ఓ ఐడీలోని ఫొటో నిందితులను పట్టించింది. దీంతో కేసు మిస్టరీ వీడింది. సోమవారం సాయంత్రం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న మినీ కాన్ఫరెన్స్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.

విశ్రాంత ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి సుబ్రహ్మణ్యం, అతని భార్య నాగలక్ష్మి మూలాపేట బ్రాహ్మణవీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. ఆమె విదేశాల్లో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వారింట్లోకి చొరబడి కత్తులతో బెదిరించారు. 300 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు దోచుకెళ్లారు. దోపిడీ ఘటనపై బాధితుడు సుబ్రహ్మణ్యం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ అన్వర్‌బాషా జరిగిన విషయాన్ని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. తన నేతృత్వంలో ఎస్సైలు బలరామయ్య, ప్రేమయ్య, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి కేసు దర్యాప్తు చేపట్టారు. 

బైక్‌ల వివరాలు సేకరించి..
దోపిడీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడడంతో కేసు మిస్టరీగా మారింది. దీంతో ఘటన ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను తొమ్మిది గంటలపాటు పోలీసులు పరిశీలించారు. కెమెరాల్లో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై దోపిడీ జరిగిన ప్రాంతంలో రెక్కీ నిర్వహించడాన్ని గుర్తించారు. రాత్రి కావడంతో వారి ముఖాలు సరిగ్గా కనిపించలేదు. దీంతో వారు వినియోగించిన బైక్‌కు సంబంధించిన వివరాలు సేకరించి అలాంటి బైక్‌లు వినియోగిస్తున్న వారిని విచారించి ఫోన్‌ నంబర్లు, ఫొటోలను సేకరించారు.

అనంతరం తమ వద్దనున్న ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఫేస్‌బుక్‌ ఐడీలను గుర్తించి అందులో ఓ యువకుడిని నిందితుడిగా భావించారు. ఆ ఫొటోను బాధితుడికి చూపించగా అతడే చోరీ చేసిందని వెల్లడించాడు. సదరు వ్యక్తిని సుందరయ్యకాలనీలోని ఏ బ్లాక్‌కు చెందిన టి. గిరీష్‌కుమార్‌గా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం గిరీష్‌కుమార్‌ మరో ముగ్గురు సర్వోదయ కళాశాల ప్రాంగణంలో ఉన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గిరీష్‌తో పాటు కనుపర్తిపాడుకు చెందిన సీహెచ్‌ అజయ్, పడారుపల్లికి చెందిన పి.రమేష్‌తో పాటు మరో మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

ఆమె చెప్పిన ప్రకారమే..
వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలోనే పి.కుసుమాబాయి అనే మహిళ భర్త నుంచి విడిపోయి కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. తెలిసిన వారి సహకారంతో బ్యాంకుల్లో లోన్లు ఇప్పిస్తూ చెడు వ్యసనాలకు బానిసైంది. ఆరునెలల క్రితం ఆమెకు తన స్నేహితుడి ద్వారా సుందరయ్యకాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ గిరీష్‌కుమార్‌తో పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. వ్యసనాలకు లోనై సులువుగా డబ్బు సంపాదించాల ని నిశ్చయించుకున్నారు.

వారి ఇంటి సమీపంలో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ దంపతులపై ఆమె కన్నుపడింది. ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉంటుందని తెలుసుకున్న ఆమె గిరీష్‌కుమార్‌కు తెలిపి దోపిడీకి పథక రచన చేసింది. దీంతో గిరీష్‌కుమార్‌ తన స్నేహితులైన అజయ్, రమేష్, మైనర్‌ బాలుడితో కలిసి ఈనెల 12వ తేది అర్ధరాత్రి సుబ్రహ్మణ్యం ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఈ మేరకు నిందితులు అంగీకరించడంతో పోలీసులు సూత్రధారి కుసుమబాయిని సైతం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.9 లక్షలు విలువ చేసే 300 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.12 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసు సిబ్బందిని, కమాండ్‌ కంట్రోల్‌ ఏఎస్సై వలీని ఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement