
అరెస్టైన మహిళా చోరులు
సాక్షి, హైదరాబాద్: జనసమర్థమున్న ప్రాంతాల్లో బంగారం ధరించిన వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ సీసీఎస్ పోలీసులు, అమన్‌గల్ పోలీసులతో కలిసి సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన దాడుల్లో శ్రీమలి చెల్లె నర్సమ్మ, వేముల సమ్మక్క, బండారి అనితలను అరెస్టు చేసి రూ.2,56,00 విలువైన 8 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా కథనం ప్రకారం...రాజేంద్రనగర్‌కు చెందిన నర్సమ్మ బెల్ట్‌షాప్ నిర్వహిస్తోంది. బొరబండకు చెందిన వేముల సమ్మక్క, ఫతేనగర్‌కు చెందిన భండారి అనిత ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతంలో వీరిపై రాజేంద్రనగర్, మియాపూర్, పేట్‌బషీరాబాద్, సనత్ నగర్, జవహర్‌నగర్, కుషాయిగూడ, మేడిపల్లి, ఘట్‌కేసర్, హుయామున్‌నగర్, లంగర్‌హౌస్, కుల్సుంపుర ఠాణాలతో పాటు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనూ కేసులు నమోదై ఉన్నాయి.
ఇటీవల అమన్‌గల్, కందుకూరు, నిజామాబాద్ వన్ టౌన్‌లోనూ వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీన్నినిని సవాల్‌గా స్వీకరించిన బాలానగర్ సీసీఎస్ పోలీసులు, అమన్‌గల్ పోలీసులతో కలిసి నిఘావేసి ఉంచారు. ఈ మేరకు వీరి ముగ్గురిని అమన్‌గల్‌లో మంగళవారం అరెస్టు చేశారు. ‘కల్లు దుకాణాలు, మార్కెట్ ప్రాంతాలకు వచ్చే వృద్ధ మహిళలను లక్ష్యంగా పెట్టుకునేవారు. ఈ ముగ్గురిలో ఒకరు బంగారు కాయిన్ దొరికిందని హడావుడి చేసేది. మరో మహిళ వచ్చి అది నిజంగానే బంగారు కడ్డీ అని నటించేది. అక్కడే ఉన్న బాధిత మహిళ ఇది నిజమని నమ్మి వచ్చి ఆ బంగారు కడ్డీలో తనకు వాటా ఇవ్వాలంటూ వాదనకు దిగేలా చేసేవారు. ఈ క్రమంలోనే బాధిత మహిళ తన మెడలో ఉన్నబంగారు ఆభరణాలను తీసి ఆ కడ్డీని తీసుకునేలా చూసి అక్కడి నుంచి పారిపోయేవార’ని పోలీసులు తెలిపారు. నర్సమ్మపై కుల్సుంపురఠాణాలో పీడీ యాక్ట్ ఉన్నట్లు తెలిపారు.