సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డైన నిందితుల చిత్రాలు
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ, పురానీహవేలీలోని హిజ్ ఎగ్జాల్డెడ్ హైనెస్ (హెచ్‌ఈహెచ్) నిజాం మ్యూజియంలో చోరీ కేసులో నిందితులకు పక్కాగా శిక్ష పడేందుకు టెస్ట్ ఐడెంటిఫికేషన్ (టీఐడీ) పెరేడ్ నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎక్కడా సరైన ఆధారాలు దొరక్కుండా పక్కాగా పథకం వేసిన గౌస్, మొబిన్‌లు ఈ నేరానికి ఒడిగట్టారు. అయినప్పటికీ నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫీడ్‌తో పాటు టీఐడీ పెరేడ్ కోర్టులో నేరాన్ని నిరూపించేందుకు ఉపకరించనున్నాయి.
ఈ కేసును విచారించే న్యాయమూర్తి నియమించే డిజిగ్నేటెడ్ జడ్జ్ సమక్షంలో జైల్లోనే ఈ టీఐడీ పెరేడ్ జరుగుతుంది. ఈ కేసులో సాక్షులు న్యాయమూర్తి సమక్షంలో నిందితులను గుర్తించాల్సి ఉంటుంది. దొంగతనానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు, ఆ తర్వాత తాము చూసింది వీరినే అని వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. సదరు నిందితులు మ్యూ జియంలో రెండుసార్లు రెక్కీ చేసినప్పుడు గమనించిన సెక్యూరిటీ గార్డులను పోలీసులు గుర్తించగలిగితే వారూ టీఐడీ పెరేడ్‌కు వస్తారు. పెరేడ్ నిర్వహించాల్సి ఉన్నందునే నిందితులను ఇప్పటివరకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. సీసీ కెమెరాల్లో రికాడ్డైనవి మినహా ఎక్కడా వారి ఫొటోలు, ఆనవాళ్లు బయటపడనీయ లేదు. విలేకరుల సమావేశం నిమిత్తం కమిషనరేట్‌కు తరలిస్తున్న సమయంలోనూ వారి ముఖాలకు ముసుగులు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
అటు మార్చి ఇటు మార్చి...
టీఐడీ పెరేడ్‌లో నిందితుడిని గుర్తించేందుకు కొన్ని ప్రమాణాలున్నాయి. నిందితుడి దేహ దారుఢ్యం, అదే పోలికలు, వయస్సులో ఉన్న దాదాపు ఆరు నుంచి పది మందిని ఎంపిక చేస్తారు. వీరి మధ్యలో నిందితుడిని ఉంచిన న్యాయమూర్తి సాక్షులను పిలిచి గుర్తించమని కోరతారు. ఇలా నిందితుడి స్థానాన్ని రెండుమూడు సార్లు మార్చి మళ్లీ గుర్తించమంటారు. అయితే టీఐడీ పెరేడ్ నిర్వహణకు ముందు నిందితుడిని సాక్షి చూడలేదని కోర్టుకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కేసుల్లో అరెస్టు చూపించే సందర్భంలో పోలీసులు నిందితుల ముఖానికి ముసుగు వేస్తారు. ఈ తంతు పూర్తయ్యే వరకు అతని ఫొటో బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. పెరేడ్‌లో పాల్గొనే సాక్షికి ముసుగు వేయడం ద్వారా వారిని నిందితుడు గుర్తించకుండా జాగ్రత్త పడతారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది పబ్లిక్ ఫిగర్, సెలబ్రెటీ అయిన పక్షంలో టీఐడీ పెరేడ్ చెల్లదు.
నిబంధనలు ఇవీ
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోని సెక్షన్ 9 అనుసరించి టీఐడీ పెరేడ్ నిర్వహిస్తారు. సాధారణంగా అత్యాచారం, దోపిడీ, బందిపోటు దొంగతనం కొన్ని హత్యలు, ఉగ్రవాద చర్యల్లో పోలీసులు టీఐడీ పెరేడ్ నిర్వహణకు కోర్టు అనుమతి కోరతారు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి దీనిని నిర్వహించకూడదు. అందుకే ఆయన మరో న్యాయమూర్తిని డిజిగ్నేట్ చేస్తారు. సాక్షులకు సమన్లు ఇచ్చి పిలిపించడం ద్వారా జైలులోనే పెరేడ్‌ను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని జైళ్లల్లో కేవలం శనివారం మాత్రమే టీఐడీ పెరేడ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జైలు అధికారులకు లేఖ రాయాల్సి ఉంటుంది.
సీసీ కెమెరాల పాత్ర కీలకం
‘మ్యూజియం చోరీ కేసుకు సంబంధించి అనేక కీలక ఆధారాలు సేకరిస్తున్నాం. న్యాయస్థానంలో నేరం నిరూపితమై, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. మ్యూజియం నుంచి గచ్చిబౌలి వరకు వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను ఆధారాలుగా సేకరిస్తున్నాం. వీటిలో ‘నేను సైతం’ ప్రాజెక్టు కింద ప్రజలు ఏర్పాటు చేసుకున్న కెమెరాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థాయిలో కెమెరాలు ఏర్పాటు చేసుకున్న నగర వాసులకు ధన్యవాదాలు’. –సిటీ పోలీసు ఉన్నతాధికారులు
Comments
Please login to add a commentAdd a comment