
న్యూఢిల్లీ : సోషల్ మీడియా సెలబ్రిటీ మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి.. దారుణంగా కాల్చి చంపారు. వివరాలు.. మోహిత్ మోర్(24) అనే వ్యక్తి టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ క్రమంలో మోర్ ప్రతిరోజు నాజ్ఫర్‌గఢ్ ప్రాంతంలో ఉన్న జిమ్‌కు వెళ్తుంటాడు. మంగళవారం సాయంత్ర జిమ్‌కు వెళ్లిన మోర్.. పక్కనే ఉన్న స్నేహితుడి ఫోటోషాప్‌కు వెళ్లి కూర్చున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు షాప్‌లోకి ప్రవేశించి..మోర్ మీద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 13 బుల్లెట్లు మోర్ శరీరంలోకి దూసుకెళ్లాయి. దాంతో అతను అక్కడిక్కడే మరణించాడు.
దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దారుణానికి పాల్పడిన వారిని గుర్తించారు. దారుణానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ముఖాలు కనిపించకుండా హెల్మెట్లు ధరించారని.. మోర్ మీద కాల్పులు జరిపిన వ్యక్తి సీసీటీవీలో క్లియర్‌గా కనిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీని ఆధారంగా నిందుతులను గాలించే పనిలో పడ్డారు పోలీసులు. అంతేకాక మోర్ ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ యాప్‌ల పోస్టింగ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.