
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని ఓ కంపెనీలో బ్యాక్‌డోర్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళ వారం అరెస్టు చేశారు.రాచకొండ సీపీ మహేష్ భగవత్ కథనం ప్రకారం... బీటెక్ పూర్తి చేసిన నరేందర్ రెడ్డి ఉద్యోగం కోసం అన్వేషిస్తూ చింతల్‌లోని రాధా కన్సల్టెన్సీ ఎండీ శ్రావణి కోటిపల్లికి తన రెస్యూమ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడికి కూకట్‌పల్లిలోని ఎకో పౌండ్ సిస్టమ్స్ రిక్రూటింగ్ ఏజెంట్‌ను రాఘవేంద్ర పేరుతో ఫోన్ వచ్చింది. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేసిన అతను ఏకో పౌండ్ సిస్టమ్ లో ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యావంటూ గతేడాది అక్టోబర్ 30న కంపెనీ మెయిల్ ఐడీ నుంచి బాధితుడి మెయిల్‌కు ఆఫర్ లెటర్ పంపాడు.
బ్యాక్‌డోర్ ప్రాసెసింగ్ చార్జీల కింద రూ.1,10,00 చెల్లించాలని రాఘ వేంద్ర చెప్పడంతో అతడిచ్చిన రెండు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమచేశాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ చేసినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన నరేందర్ రెడ్డి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ సైదులు నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటా ఆధారం గా అలియాబాద్‌లో అతడిని అరెస్టు చేసింది.