రాములు మృతదేహం
సాక్షి,సిరిసిల్ల: రెండ్రోజుల్లో కూతురు పెళ్లి.. ఇంటి నిండా సందడి.. పచ్చని తోరణాలు కట్టాలని తలచిన తండ్రి మామిడాకులు తీసుకురావడానికి వెళ్లాడు. మామిడి చెట్టెక్కి ఆకులు తెంపుతూ.. జారికిందపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. స్థానిక సంజీవయ్యనగర్‌కు చెందిన సిరిగిరి రాములు(55) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడికి భార్య సంతోష. నలుగురు కూతుళ్లు ఉన్నారు.
1న మూడో కూతురు పెళ్లి..
మూడో కూతురు ఆమని పెళ్లి ఏప్రిల్ 1న జరుగనుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో అందరూ నిమగ్నమయ్యారు. మామిడి తోరణాలకని రాములు శుక్రవారం ఉదయం 8గంటలకు ఇంట్లోంచి వెళ్లాడు. మామిడి తోటలో చెట్టు పైనుంచి పడిపోయిన రాములు అచేతనంగా ఉండగా మధ్యాహ్నం 3గంటలకు తోటమాలి బాలయ్య గమనించి రాములు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో ఇంటి సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు వచ్చేసరికి రాములు విగత జీవిగా పడిఉన్నాడు. పెళ్లింట్లో ఈ సంఘటన పెనువిషాదాన్ని నింపింది.
మిన్నంటిన రోదనలు
రాములు ఆటో నడుపుతూ.. నలుగురు కూతుళ్లను చదివించి పెద్దచేశాడు. కష్టజీవిౖయెన రాములు ఫంక్షన్ హాలు తీసుకోవడం ఖర్చుతో కూడింది కావడంతో ఉన్నంతలో వైభవంగా జరిపించాలని ఉబలాటపడ్డాడు. ఈక్రమంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోస్టుమార్టం చేయడానికి సమయం మించిపోవడంతో శవాన్ని మార్చురీలో ఉంచారు. సిరిసిల్ల ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.ఎస్సై నరేశ్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment