
దోమయ్య మృతదేహం
సీతంపేట : వివాహ శుభకార్యం జరుగుతుండగా సామగ్రి తీసుకురావడానికి వెళుతూ ఆటో బోల్తా పడిన ఘటనలో ఒక గిరిజనుడు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పులిపుట్టి బ్రిడ్డి వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. కొండపోడు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న గిరిజనుడు దుర్మరణం చెందారు. సాయం చేసేందుకు వెళ్లి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
సీతంపేటలో వివాహం జరుగుతుండగా వాటర్ ప్యాకెట్లతో పాటు ఇతర సామగ్రి అయిపోవడంతో వాటిని తీసుకురావడానికి మోహన్‌కాలనీకి చెందిన గ్రామస్తులు ఊయక దోమయ్య(30)తో పాటు ఊయక మంగయ్య, బిడ్డిక కొండలు, ఊయక బిల్లింగు(డ్రైవర్) కొత్తూరు వెళుతున్నారు. మార్గమధ్యంలో పులిపుట్టి బ్రిడ్జి వద్ద అదుపు తప్పి ఆటో బోల్తాపడడంతో దోమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. గ్రామంలో శుభకార్యం జరుగుతుండగా సంఘటన చోటుచేసుకోవడంతో విషాదం నెలకొంది. మృతుడికి భార్య సుగుణతో పాటు ఐదేళ్లు మూడేళ్లు ఉన్న ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నారు.
తండ్రి మృతదేహం వద్ద తల్లి వెక్కివెక్కి ఏడుస్తుంటే ఏమైందో తెలియక పిల్లలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. కొండపోడు పనులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న గిరిజనుడిపై ఆటోరూపంలో మృత్యువు వచ్చిందని, అందరు చిన్నపిల్లలు కావడంతో తమకు దిక్కెవరని మృతదేహం వద్ద సుగుణ విలపిస్తోంది.
ఎస్‌ఐ కె.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఊయక మంగయ్య, బిడ్డిక కొండలు, ఊయక బిల్లంగును కొత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి నుంచి పాలకొండ ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment