
మృతదేహం, చెట్టును ఢీకొన్న కారు
ఓ సీరియల్ చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ నగరం నుంచి సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లారు.
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతిచెందారు. టీవీ ఆర్టిస్టులు ఓ సీరియల్ చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ నగరం నుంచి సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లారు. అనంతగిరి గుట్టలపై షూటింగ్ అనంతరం కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మొయినాబాద్ మండలం అప్పారెడ్డిగూడ బస్టాప్ వద్ద మంగళవారం తెల్లవారు జామున వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో నిర్మల్ ప్రాంతానికి చెందిన భార్గవి (20) అక్కడికక్కడే మృతి చెందగా, భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన అనుషారెడ్డి (21) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. కారు డ్రైవర్ చక్రితో పాటు మరో వ్యక్తి వినయ్‌కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు మొయినాబాద్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.