
కేసు వివరాలను వెల్లడిస్తున్న సీఐ ప్రమోద్‌రావు
శ్రీరాంపూర్(మంచిర్యాల) : ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలన్న ఇద్దరు పాత నేరస్తుల పథకం విఫలమై ఓ యువకుడి హత్యకు దారితీసిన వైనమిది. నస్పూర్ గ్రామ సమీపంలో ఈ నెల 17న జరిగిన గడ్డం శివగౌడ్(22) హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ ప్రమోద్‌రావు సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
శ్రీరాంపూర్ ఏరియా హిమ్మత్‌నగర్‌కు చెందిన లారీ క్లీనర్ తాళ్లపల్లి రాకేశ్‌గౌడ్ అలియాస్ లక్ష్మణ్, సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన ర్యాకం రమేశ్ కలిసి ఈ హత్య చేశారని తెలిపారు. హతుడు నస్పూర్‌కు చెందిన శివగౌడ్ నిందితుల్లో ఒకరైన రాకేశ్‌గౌడ్ దూరపు బంధువులు. రాకేశ్‌గౌడ్ పాత నేరస్తుడు. గతేడాది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సెల్‌ఫోన్, నగదు దోపిడీ కేసులో నిందితుడు.
మరో నిందితుడు రమేశ్ సైతం పాత నేరస్తుడే. ఇతడిపై బైక్ దొంగతనాల కేసు ఉంది. ఇద్దరు చంచలగూడ జైల్లో ఖైదీలుగా ఉండగా పరిచయం ఏర్పడింది. బయటికి వచ్చిన తరువాత మళ్లీ నేరాల ప్రవృత్తితో ఈ హత్యకు ఒడిగట్టారు. ఇందులో భాగంగా రాకేశ్‌గౌడ్ హైదరాబాద్‌లో ఉన్న రమేశ్‌కు ఫోన్ చేసి నస్పూర్‌లో తన దూరపు బంధువు శివగౌడ్ ఉన్నాడని, అతడిని కిడ్నాప్ చేసి బెదిరించి రూ.5 లక్షలు వసూలు చేద్దామని చెప్పాడు.
దీనికి రమేశ్ అంగీకరించడంతో ఇద్దరు కలిసి పథకం రచించారు. ఈనెల 17న నస్పూర్‌కు వచ్చారు. రాకేశ్‌గౌడ్ తన ఫోన్‌తో శివగౌడ్‌కు ఫోన్ చేసి ఇక్కడ కొంచెం పని చేసి పెట్టాలని చెప్పడంతో శివగౌడ్ ఇంటి నుంచి వచ్చి వీరిద్దరిని కలిశాడు. తరువాత శివగౌడ్ బైక్‌పైనే ముగ్గురు కలిసి సీతారాంపల్లి దారిలోని వైన్స్‌కు వెళ్లి మద్యం కొనుక్కున్నారు.
అక్కడినుంచి బైక్‌పై కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలోకి వచ్చి ఒక షెడ్డులో మద్యం సేవించారు. షెడ్డు యాజమాని వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పడంతో నస్పూర్ సమీపంలోకి వెళ్లి మద్యం తాగారు. ముందుగా ఒక దెబ్బకొట్టి రక్తం వచ్చిన తరువాత ఆ ఫొటోను శివగౌడ్ కుటుంబసభ్యులకు పంపించి డబ్బులు డిమాండ్ చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
అయితే తాగిన మైకంలో రమేశ్ బీరు సీసాతో శివగౌడ్ తలపై కొట్టాడు. తీవ్ర గాయమై రక్తం రావడంతో వెంటనే రాకేశ్‌గౌడ్ స్పందిస్తూ ‘వాడు లేస్తే ఊరుకోడు.. మనల్నే వేస్తాడు..’ అంటూ తన చేతిలో ఉన్న బీరు సీసాతో శివగౌడ్ తలపై బాదాడు. బండరాయితో తలపై మోదారు. దీంతో శివగౌడ్ అక్కడక్కిడే మృతి చెందాడు.
రమేశ్‌పై రక్తం మరకలు పడడంతో వెంటనే తన ప్యాంటు విప్పి హతుడు శివగౌడ్ ప్యాంటు వేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. మంచిర్యాల వెళ్లిన తరువాత రమేశ్ ప్యాంటు కొనుక్కొని వేసుకొని అక్కడినుంచి ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు.
నిందితులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ..
నిందితులను వైన్స్‌షాపులోని సీసీ టీవీ కెమెరా పట్టించింది. ఈ నెల 17న ఇంట్లో నుంచి వెళ్లిన శివగౌడ్ సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల వెతికారు. అదే సమయంలో సాయంత్రం శివగౌడ్ సెల్‌కు తండ్రి వెంకాగౌడ్ ఫోన్ చేయగా ఎత్తలేదు.
తరువాత శివగౌడ్ వద్ద ఆటో డ్రైవర్‌గా పనిచేసే సతీశ్‌కు ఫోన్ చేయగా శివగౌడ్ ఫోన్‌ను రమేశ్ ఎత్తి మాట్లాడారు. ఫోన్ శివగౌడ్‌కు ఇవ్వాలని కోరితే అతడు పనిమీద ఉన్నాడని, అకౌంట్‌లో డబ్బులు వేయమని చెప్పి అకౌంట్ నంబర్ ఇచ్చారు. ఇది కూడా క్లూకు ఆధారమైంది.
తరువాత శివగౌడ్‌కు మరోసారి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ అయ్యింది. దీంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వైన్స్ వద్దకు వచ్చి ఉంటారనే అనుమానంతో అడుగగా అక్కడ ఫాస్ట్‌ఫుడ్ నిర్వహించే వ్యక్తి ఉదయం శివగౌడ్‌తో పాటు మరో ఇద్దరు వచ్చి మద్యం తీసుకెళ్లినట్లు చెప్పాడు.
షాపులోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా అందులో శివగౌడ్‌తోపాటు మరో ఇద్దరు ఉన్నట్లు కనిపించింది. దీని ఆధారంగా నిందితుల కోసం గాలించగా శ్రీరాంపూర్‌లో దొరికారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment