ప్రణతమ్, నరసింహం మృతదేహాలు
సాక్షి, రేపల్లె(నగరం): గుంటూరు జిల్లా రేపల్లె మండల పెనుమూడి కృష్ణానదీ తీరంలో విషాదం చోటుచేసుకుంది. నదిలోకి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. పట్టణ సీఐ జి.నారాయణ కథనం ప్రకారం పట్టణానికి చెందిన నారాయణ స్కూల్‌కు చెందిన 12 మంది 9వ తరగతి విద్యార్థులు పెనుమూడి కృష్ణానదీ తీరానికి వెళ్లారు. స్కూల్ వార్షికోత్సవం కోసం శనివారం సాయంత్రం డ్యాన్స్ పోటీలకు ప్రాక్టీస్ పూర్తిచేసుకుని సరదాగా పెనుమూడి రేవుకు ఈతకు వెళ్లారు. ఈత వేస్తున్న సమయంలో ఒక్క సారిగా రేపల్లె మండలం బేతపూడి గ్రామానికి చెందిన కుమ్మరిగుంట ప్రణతమ్(14), నిజాంపట్నం మండలం తోటకూరవారిపాలెం గ్రామానికి చెందిన తోటకూర నరసింహం(14) మునిగిపోయారు.
తోటి విద్యార్థులు కేకలు వేయటంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. తొలుత నరసింహాన్ని మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. వెంటనే 108 ద్వారా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. నరసింహం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్న సమయంలో నరసింహం మృతి చెందాడు. నీట మునిగిన రెండో విద్యార్థి ప్రణితమ్ మత్స్యకారులు వెలికి తీయగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ప్రణతమ్ తల్లితండ్రులు
రెండు గ్రామాల్లో విషాదం
రేపల్లె మండలం బేతపూడి గ్రామానికి చెందిన కుమ్మరిగుంట రత్నశేఖర్, కమలాకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు ప్రణతమ్ 9వ తరగతి చదువుతున్నాడు. కొడుకు మృతి చెందటంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంట తడిపెట్టించింది. నిజాంపట్నం మండలం తోటకూరవారిపాలెం గ్రామానికి చెందిన తోటకూర వెంకట్రావ్, రేణుకాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. నరసింహం పెద్దకుమారుడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వెంకట్రావ్ కష్టపడి పిల్లలను చదివించుకుంటున్నాడు. ఇద్దరు విద్యార్థుల దుర్మరణంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.
విద్యార్థుల ఉసురు తీసిన ఎమ్మెల్యే ఇసుక దందా
ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అక్రమ ఇసుక దందా ఇద్దరి విద్యార్థుల ఉసురుతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెనుమూడి రేవులో అక్రమంగా ఇసుకతీతకు భారీ డ్రెజ్జర్లను ఉపయోగించటంతో తీరం వెంబడి భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలియని చిన్నారులు తీరంలో కొంత దూరం వెళ్లగానే భారీ అగాధంలో పడి మృత్యువాత పడ్డారని ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం తెలుస్తున్నది. డ్రెజ్జర్లతో ఇసుకను తోడుతున్న విషయాన్ని ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు వెన్నుకాయటంతో నేటికి ఆయన ఆగడాలకు అడ్డుఆపు లేకుండా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment