
పనాజి : ఓ అర్చకుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఇద్దరు మహిళలు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గోవాలోని మంగూషి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అర్చకుడు తమను కౌగిలించుకోవడంతో పాటు, ముద్దు పెట్టుకున్నాడని ఇద్దరు మహిళలు వేర్వేరుగా ఆలయ కమిటీకి లేఖలు రాశారు. గత నెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ 14న ఆ అర్చకుడిపై తొలి ఫిర్యాదు రాగా, రెండోది జూన్ 22న వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ సెక్రటరీ అనిల్ కేన్ర్క్ ధ్రువీకరించారు. సదరు మహిళల ఆరోపణల్లో నిజం లేదని తమ ప్రాథమిక విచారణలో తెలిందన్నారు. ఒకవేళ ఆ లేఖల్లో ప్రస్తావించిన అంశాలు నిజమని తెలితే అర్చకుడిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కానీ ఇప్పుడే అతన్ని తన విధుల నుంచి సస్పెండ్ చేయలేమన్నారు.
‘నేను కుటుంబంతో పాటు గుడికి వచ్చినప్పుడు, అర్చకుడి పాదాలకు నమస్కరించే సమయంలో తను నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో నేను భయపడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ సమయంలో తన తల్లిదండ్రులు ఆలయంలో వేరేచోట ఉన్నారు. మీకు అంతగా అనుమానం ఉంటే ఆ రోజు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాల’ని మొదట ఫిర్యాదు చేసిన మహిళ తన లేఖలో పేర్కొంది. మరో మహిళ తన లేఖలో ఆ అర్చకుడు లాకర్ ఏరియాలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ముద్దు కూడా పెట్టాడాని ఆరోపించారు. అకస్మాత్తుగా అతను అలా చేయడంతో తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆధారాల కోసం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాలని కోరారు. అతడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించిన చోట సీసీ కెమెరాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
కాగా రెండో మహిళ లేఖకు అనిల్ స్పందించారు. ఆమె ఫిర్యాదుపై జూలై 4వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టగా.. అందులో నిజం లేదని తెలిందన్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేపట్టడానికి ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. కావాంటే ఆమె సంబంధిత అధికారులను సంప‍్రదించాల్సిందిగా సూచించారు.