రక్తపుమడుగులో ఆదిలక్షుమ్మ , చరిపాస్టర్ చేతిలో హతమైన ఇందిరమ్మ
రాజంపేట : రాజంపేట రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం వేర్వేరు ప్రాంతాల్లో రెండు హత్యలు జరిగాయి. సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ సీఐ నరసింహులు, ఎస్‌ఐ మహేశ్‌నాయుడులు సంఘటన స్ధలాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇందులో ఓ చర్చి పాస్టర్ తనతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళను గొంతు నులిమి చంపి బీరువాలోని నగలతో ఉడాయించగా.. మరో సంఘటనలో మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. రూరల్ సీఐ నరసింహులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
బోయనపల్లెలో వివాహితను చంపినచర్చి పాస్టర్
బోయనపల్లెలో కామినేని ఇందిరమ్మ (30), ఆమె భర్త చెంగయ్య నివాసముంటున్నారు. వీరికి సంతానం లేదు. ఇందిరమ్మ అక్క జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లింది. ఆమె పంపిన డబ్బుతో ఇల్లు నిర్మించుకుని అందులో అక్క పిల్లలతో కలిసి వీరు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సమీపంలోని ఓ చర్చి పాస్టర్ సుబ్బరాయుడుతో మూడేళ్ల నుంచి ఇందిరమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. శనివారం తెల్లవారుజామున ఇందిరమ్మను కలిసేందుకు సుబ్బరాయుడు వచ్చాడు. అప్పటికే వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆమెను గొంతు నులిమి చంపి బీరువాలో ఉన్న బంగారు నగలతో ఉడాయించాడు. మృతురాలి భర్త చెంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు క్లూస్‌టీం రంగంలోకి దిగింది.
అనుమానంతో భార్యను హత్యచేసిన భర్త
పగటితోట ఆదిలక్షుమ్మ (45), రాముడు పట్టణ పరిధిలోని మన్నూరు దళితవాడకు చెందిన వారు. గత ఏడేళ్లుగా ఆదిలక్షుమ్మ కర్నూలులోని హోటల్‌లో పనిచేస్తూ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ ఏడాది మార్చి 15న బలిజపల్లె జాతర సందర్భంగా అమ్మను పిలిపించాలని ఇద్దరు కుమారులు మణికంఠ, చరణ్‌లు తండ్రి రాముడుని కోరారు. దీంతో అతను కర్నూలులో ఉన్న భార్య ఆదిలక్షుమ్మను పిలిపించాడు. అప్పటికే భార్యపై అనుమానంతో రగిలిపోతున్న భర్త శనివారం తెల్లవారుజామున మద్యంమత్తులో భార్యను విచక్షణారహితంగా చితకబాదాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఇంటి బయట పడుకుని ఉన్న కుమారులు తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె రక్తపుమడుగులో పడి ఉంది. ఆమె భర్త రాముడు పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తనయుడు మణికంఠ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment