బాధితుడితో పాటు కిడ్నాపర్లూ నేరస్తులే.. | Visakhapatnam Police Reveals Kidnap Case | Sakshi
Sakshi News home page

అందరూ దొంగలే.!

Published Sat, Jul 11 2020 10:59 AM | Last Updated on Sat, Jul 11 2020 10:59 AM

Visakhapatnam Police Reveals Kidnap Case - Sakshi

ప్రసాద్‌ ఏ1 నిందితుడు రామ్‌రెడ్డి ఏ2 నిందితుడు

దొండపర్తి(విశాఖ దక్షిణం): దొండపర్తి ప్రాంతంలో డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ఇటీవల జరిగిన కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపునకు పాల్పడిన ఏడుగురిలో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మిగతా వారి ఆచూకీ కోసం గాలిసున్నారు. ఇదిలా ఉండగా కిడ్నాప్‌కు గురైన, కిడ్నాప్‌కు పాల్పడిన వారందరూ పాత నేరస్తులు కావడం గమనార్హం. నేరచరిత్ర ఉన్నవారిని టార్గెట్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసినా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేరన్న అభిప్రాయంతో నిందితులు తెలివిగా ఈ పంథాను ఎంచుకున్నారు. ఈ క్రమంలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న డాబాగార్డెన్స్‌ ప్రాంతానికి చెందిన జామి సురేష్‌ను టార్గెట్‌ చేసి ఈ నెల 5న డీఆర్‌ఎం కార్యాలయం వద్ద కిడ్నాప్‌ చేశారు. పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 72 గంటల్లో కేసును ఛేదించారు. మొత్తం ఏడుగురి నిందితుల్లో పల్లపు ప్రసాద్‌(35), పారపాతి రామ్‌రెడ్డి(55)లను అదుపులోకి తీసుకున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా తెలిపారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. ఈ కిడ్నాప్‌ కేసు వివరాలను సీపీ ఆర్కే మీనా, డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి శుక్రవారం విలేకరుల స మావేశంలో తె లియజేశారు.

ఈ నెల 5న డాబాగార్డెన్స్‌ ప్రాంతానికి చెందిన జామి సురేష్‌కుమా ర్, అతని స్నేహితుడు ఎ.ఎస్‌.ఎన్‌.ఎల్‌.రాజుతో కలిసి తన కారులో డీఎంఆర్‌ కార్యాలయంలో వద్ద ఉన్నారు. అదే సమయంలో కారులో నలుగురు వ్యక్తులు వచ్చి తుపాకులు, కత్తులతో సురేష్, రాజును బెదిరించి వారి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. పరవాడ ప్రాంతానికి తీసుకువెళ్లి ఓ ఇంట్లో బంధించారు. తమకు రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని సురేష్‌ను కొట్టి బెదిరించారు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో చివరకు రూ.30 లక్షలు ఇవ్వడానికి అంగీకరించాడు. అదీ కూడా ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో కుదవ పెట్టి ఇస్తానని చెప్పాడు. దీంతో కిడ్నాపర్లు మరుసటి రోజు 6న సీతంపేటలో ఉన్న ఐఐఎఫ్‌ఎల్‌ బ్యాంకు వద్దకు సురేష్‌ను తీసుకువచ్చారు. సురేష్‌.. ఇంట్లో ఉన్న బంగారాన్ని తేవాలని తన భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. అయితే భర్తపై అప్పటికే అనేక కేసులు ఉండడంతో ఆమెకు అనుమానం వచ్చి ఎందుకని ప్రశ్నించింది. తనను కొందరు కిడ్నాపర్‌ చేశారని చెప్పడంతో సురేష్‌ కుమారుడు 100కు కాల్‌ చేసి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు అప్రమత్తమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని తెలుసుకున్న కిడ్నాపర్లు.. సురేష్‌ను అక్కడి నుంచి కారులో తీసుకుపోయారు. నగరంలో ప్రతి చోటా తనిఖీలు నిర్వహిస్తుండడంతో కిడ్నాపర్లు భయపడి సురేష్‌ను పరవాడ ప్రాంతంలోనే వదిలి పరారయ్యారు.

కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు
ఈ కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను వివిధ జిల్లాలకు పంపించారు. ఈ క్రమంలో సురేష్‌కుమార్‌ నగరంలోనే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో కూడా రైస్‌పుల్లింగ్‌ పేరుతో అనేక మందిని మోసం చేసిన వ్యవహారాల్లో మొత్తం 6 కేసులు ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారించగా.. అసలు విషయాలు బయటపడ్డాయి. కిడ్నాపర్లలో ఒకరు సురేష్‌కుమార్‌తో పరిచయం ఉన్నట్టు గుర్తించారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో మొత్తం ఏడుగురు పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అందులో గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామానికి చెందిన పల్లపు ప్రసాద్‌(35) ఏ1గా, నగరంలో చినముషిడివాడకు చెందిన పారపాతి రామ్‌రెడ్డి(55) ఏ2గా పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగిన 72 గంటల్లోనే ప్రసాద్‌ను ఒంగోల్‌లోను, రామ్‌రెడ్డిని నగరంలోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇలా కిడ్నాప్‌ పథక రచన
ఏ1గా ఉన్న ప్రసాద్‌ కూడా రైస్‌పుల్లింగ్, దొంగ నోట్లు కేసుల్లో నిందితుడు.  
గతంలో కొంత మంది ప్రసాద్‌ను ఇదే తరహాలో కిడ్నాప్‌ చేసి తన నుంచి డబ్బులు దోచుకున్నారు.
దీంతో అదే తరహాలో నేరచరిత్ర కలిగిన వారిని టార్గెట్‌ చేస్తే పోలీసులకు దొరికే అవకాశం ఉండదని భావించాడు.
దీంతో ఏ2గా ఉన్న రామ్‌రెడ్డికి ప్లాన్‌ను వివరించాడు. ఇద్దరూ కలిసి ఎవరిని కిడ్నాప్‌ చేయాలన్న విషయంపై పథక రచన చేశారు.
ఇంతలో గత నెల 29న రామ్‌రెడ్డి ద్వారా సురేష్‌కుమార్‌ను ప్రసాద్‌ నగరంలో ఒక హోటల్‌ కలిశాడు. దొంగ బంగారం చూపించి ఎవరినైనా మోసం చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు.
ఆ తరువాత ప్రసాద్, రామ్‌రెడ్డి ఇద్దరూ కలిసి సురేష్‌కుమార్‌నే కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు.  
ఇందుకోసం ఈ నెల 2న వీరికి తెలిసిన మరో వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు చెందిన నలుగురి సహాయం తీసుకున్నారు.
ఈ నెల 4న సరేష్‌ను కిడ్నాప్‌ చేయడానికి రెక్కీ నిర్వహించారు.
5న డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ఉన్న సమయంలో సురేష్‌తో పాటు అతని స్నేహితుడిని సైతం కిడ్నాప్‌ చేశారు.
 సంఘటన జరిగిన 72 గంటల్లో పోలీసులు కేసును ఛేదించి ఇద్దరి అరెస్టు చేశారు.
మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నారు.
వీరు ఈ తరహా కిడ్నాప్‌లు, చేసిన మోసాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

కేసును ఛేదించిన అధికారులకు రివార్డులు
కిడ్నాప్‌ కేసును 72 గంటల్లో ఛేదించిన పోలీసులు అధికారులు, సిబ్బందిని సీపీ మీనా, డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగి అభినందించా రు. వారికి రివార్డులు అందజేశారు. ఫోర్త్‌టౌ న్‌ సీఐ ప్రేమ్‌కుమార్, క్రైమ్‌ సీఐలు అవతారం, పి.సూర్యనారాయణ, ఫోర్త్‌టౌన్‌ ఎస్‌ఐలు పి.శ్రీనివాసరావు, పి.సూర్యనారాయణ, కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్‌ కె.రమేష్, శివకుమార్, హోంగార్డ్‌ రమేష్‌కు సీపీ రివార్డులు అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement