సాక్షి, ములుగు: అప్పుగా ఇచ్చిన డబ్బులు అడగడానికి వెళ్లినవారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వరంగల్‌కు చెందిన దేవేందర్‌రెడ్డి పస్రాలోని బేకరీ నిర్వహిస్తున్న ప్రభు, దయాలకు రూ.6లక్షల వరకు అప్పు ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి అడిగేందుకు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం హవేలీ గ్రామానికి ఫ్రీలాన్సర్ ఫొటో జర్నలిస్ట్, వరంగల్ ప్రెస్‌క్లబ్ కోశాధికారి బొమ్మినేని సునీల్‌రెడ్డి (40)తో కలిసి సోమవారం పస్రాకు వెళ్లారు. తన డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలంటూ అడిగారు.
స్థానిక వ్యాపారి ఒకరు తనకు డబ్బులు ఇవ్వాలని.. అతను ఇచ్చాక చెల్లిస్తానని దయ బదులిచ్చాడు. దీంతో దేవేందర్‌రెడ్డి, సునీల్‌రెడ్డి కలిసి సదరు వ్యాపారి వద్దకు వెళ్లి డబ్బుల విషయమై అడిగారు. అయితే, తాను బేకరీవారికి డబ్బులు ఇవ్వాల్సిందేమీ లేదని చెప్పడంతో ఇరువురూ తిరిగి బేకరీ వద్దకు వచ్చారు. దయాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అతడు దేవేందర్‌రెడ్డి తలపై సీసాతో దాడి చేశాడు. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు వచ్చి దేవేందర్‌ను ములుగు ఆస్పత్రికి తరలించారు. సునీల్‌రెడ్డిని దయ ఉంటున్న గది వద్దకు తీసుకెళ్లి అతడిపై దాడి చేసి హత్యచేశాడు. దయాతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment