
భిక్షపతి మృతదేహాన్ని బయటకు తెస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంమేడ భిక్షపతి (ఫైల్)
కాజీపేట : భవానీనగర్‌లో భవనం కుంగిపోయిన ఘటనలో కనిపించకుండా పోయిన వాచ్‌మన్ భిక్షపతి.. భవనం శిథి లాల కింద విగతజీవిగా కనిపించాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బం ది 12 గంటలపాటు శ్రమించి మేడ భిక్షపతి మృతదేహాన్ని గురువారం తెల్లవారు జామున 3 గంటలకు బయటకు తీశారు. మంగళవారం రాత్రి భవానీనగర్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం కుంగిపోగా వాచ్‌మన్‌గా భిక్షపతి శిథిలాల కింద చిక్కుకుపోయాడు.
జిల్లా కలెక్టర్ అమ్రపాలి చొరవ మేరకు భూపాలపల్లి, హైదరాబాద్ నుంచి 40 మందితో కూడిన రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు భిక్షపతి కుటుంబ సభ్యులతో చర్చించి ఎక్కడ నిద్రిస్తాడో తెలుసుకుని అధికారుల పర్యవేక్షణలో భవ నం కూల్చివేత పనులను మొదలు పెట్టారు. 12 గంటలకుపైగా శ్రమించిన తరువాత భిక్షపతి మృతదేహం లభించడంతో అతి కష్టం మీద బయటకు తీశారు.
తప్పించుకునే మార్గం లేకనే..
కుటుంబ సభ్యులకు తగు జాగ్రత్తలు చెప్పి భవనంలో పడుకోవడానికి భిక్షపతి వచ్చిన 10 నిమిషాల్లోనే భవనం కుప్పకూలిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి భవనం శిథిలాల కింద కొన ఊపిరితో ఉండొచ్చనే నమ్మకంతో ఉన్న కుటుంబ సభ్యులు భిక్షపతి మృతదేహాన్ని చూడగానే గుండెలవిసేలా రోధించారు. మృతుడు తప్పించుకునే క్రమంలోనే పడుకున్న చోటు నుంచి వరండాలోకి పరుగెత్తుకు వచ్చి శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యులు వివరించారు.
మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన..
వాచ్‌మన్ భిక్షపతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం బంధు, మిత్రులు ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. భవనం యజమానితో కలిసి భిక్షపతి కుటుంబానికి సహాయం దక్కకుండా చేయడానికి ప్రయత్నించడం ఎంత వ రకు సమంజసమంటూ నిలదీశారు. పాఠశాల బస్సు ఎదుట బైఠాయించి మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
రూ.10లక్షల పరిహారం ఇప్పించాలంటూ పాఠశాల నిర్వాహకుడు నవీన్‌రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. ఒక దశలో కట్టెలను తెచ్చి పాఠశాలలోనే భిక్షపతిని దహనం చేస్తామంటూ పేర్చడానికి ప్రయత్నిం చారు. దీంతో కొద్దిసేపటి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్నాయి. పరిస్థితి చెయ్యి దాటే పరిస్థితి తలెత్తడంతో.. సీఐ అజయ్, తహసీల్దార్ రవీందర్ జోక్యం చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామంటూ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మార్పీస్ నాయకులు వాచ్‌మన్ కుటుంబ సభ్యుల పక్షాన భవన యజమాని బంధువులతో పరిహారంపై చర్చలు జరుపుతున్నారు. పరిహారం విషయం తేలే వరకు పోలీసులకు ఫిర్యాదు చేసేది లేదంటూ మృతుడి కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూర్చున్నారు.